ట్రంప్‌, బైడెన్‌: ఇందులోనూ భిన్న ధృవాలే
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ట్రంప్‌, బైడెన్‌: ఇందులోనూ భిన్న ధృవాలే

మద్దతుదారులకు తమదైన శైలిలో కృతజ్ఞతల వెల్లడి

వాషింగ్టన్‌: ప్రపంచమే ఊపిరి బిగపట్టి గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన వారికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆయన ప్రత్యర్థి, డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ భిన్నంగా స్పందించారు. తనకు మద్దతు ఇవ్వని వారి కోసం తాను మరింత కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. నిజానికి అధ్యక్షుడి బాధ్యత అదేనని బైడెన్‌ అభిప్రాయపడ్డారు.

అద్యక్షుడిగా తనకు మరో నాలుగేళ్లు అవకాశమివ్వాలని ట్రంప్‌ కోరుతున్న సంగతి తెలిసిందే. ‘‘నా మద్దతుదారులందరికీ.. నా హృదయాంతరాళాల నుంచి కృతజ్ఞతలు. తొలినుంచి మీరు నాకు మద్దతుగా ఉన్నారు.. మీ నమ్మకాన్ని నేను వృధా పోనివ్వను. మీ ఆశలే నా ఆశలు, మీ కలలే నా కలలు.. మీ భవిష్యత్తు కోసమే నేను ప్రతిరోజూ పోరాడుతున్నాను.’’ అని ఆయన మంగళవారం ఉదయం ట్వీట్‌ చేశారు.

ఇక బైడెన్‌ కూడా ‘‘డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా గర్వంగా నిలబడ్డాను. అయితే నేను అమెరికా అధ్యక్షుడిగా పాలిస్తాను. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరితో కలసి పనిచేస్తాను. ఐతే నాకు మద్దతు ఇచ్చిన వారికంటే ఇవ్వని వారి కోసం మరింతగా కష్టపడతాను. ఎందుకంటే అదే ఓ అధ్యక్షుడి ధర్మం.’’ అని ప్రకటించారు.

ఇదిలా ఉండగా వెర్మోంట్‌ రాష్ట్రంలో తొలుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడి న్యూ హాంప్‌షైర్‌లోని రెండు పట్టణాల్లో తొలి పోలింగ్‌ జరిగింది. మెజారిటీ ప్రీపోల్స్‌ సర్వేలు డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ వైపే మొగ్గుచూపినప్పటికీ.. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ ఓటమిని మాత్రం ఖాయం చేయలేకపోవటం గమనార్హం.


మరిన్ని