ట్రంప్‌ ఖాతాలో అలస్కా
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ట్రంప్‌ ఖాతాలో అలస్కా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ను అనుకూలంగా ఇది వరకే ఫలితాలు వచ్చినప్పటికీ 3 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఉన్న అలస్కాలో మాత్రం తాజాగా ఫలితం వెలువడింది. నార్త్‌ కరోలినాలో కౌంటింగ్‌ కొనసాగుతోంది.మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లకు గానూ డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ 284 ఓట్లు సాధించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. అలస్కాలో  బైడెన్‌ 39.1 శాతం ఓట్లు సాధించగా 56.9 శాతం ఓట్లతో ట్రంప్‌ పై చేయి సాధించారు. దీంతో ట్రంప్‌ ఖాతాలో మరో మూడు ఎలక్టోరల్‌ ఓట్లు  చేరాయి. మొత్తం ఓట్ల సంఖ్య 217కి పెరిగింది. అంతేకాకుండా అదే రాష్ట్రంలోని సెనేట్‌ సీటును కూడా రిపబ్లికన్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో 100 సభ్యులున్న సెనేట్‌లో రిపబ్లికన్ల బలం 50కి పెరిగింది. అలస్కాలో 20 శాతానికిపైగా ఓట్ల మెజార్టీతో ట్రంప్‌ విజయం సాధించినట్లు ఇవాంక ట్రంప్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

మరోవైపు అధ్యక్షఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించినప్పటికీ, అధికార మార్పిడి అంత సులువుగా జరిగే అవకాశాలు కన్పించడం లేదు. పెన్సిల్వేనియా, జార్జియా తదితర రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించకపోవడం సరికాదని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యవహార శైలితో అధికార బదిలీపై ఎలంటి ప్రభావం పడటం లేదని, ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించామని చెబుతున్నారు. అమెరికా సంప్రదాయం ప్రకారం జనవరి 20న నూతన అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది.


మరిన్ని