యూకేలో మళ్లీ తిరగబడుతున్న కరోనా!
యూకేలో మళ్లీ తిరగబడుతున్న కరోనా!

హెచ్చరిస్తున్న ఆరోగ్యరంగ నిపుణులు

లండన్‌: మార్చినెలలో కరోనా వైరస్‌ మహమ్మారి దాటికి యూకే వణికిపోయింది. అనంతరం వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం నిబంధనలకు కఠినతరం చేసింది. ఈ సమయంలో యూకేలో మార్చి నెలలో లాక్‌డౌన్‌ విధించినప్పటి పరిస్థితులే మరోసారి పునరావృతం అవుతాయని అక్కడి ప్రభుత్వ ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితుల వల్ల ఈ వైరస్‌ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు. సమాజంలో వైరస్‌ సంక్రమణ రేటును తెలియజేసే ‘ఆర్‌ నంబర్‌’ ప్రస్తుతం 1.2 నుంచి 1.5 వరకు ఉన్నట్లు డిప్యూటీ చీఫ్ మెడికల్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ జొనాథన్‌ వాన్‌-టామ్‌ స్పష్టంచేశారు. దీని అర్థం పాజిటివ్‌ సోకిన వ్యక్తి నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి వైరస్‌ సంక్రమించే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. ఇంకా మనం మహమ్మారి విజృంభణ మధ్యదశలోనే ఉన్నట్లు ఆయన స్పష్టంచేశారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం యూకే ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించే ముందురోజే వైద్యనిపుణులు ఈ హెచ్చరిక చేశారు.

నిండిపోతున్న ఆసుపత్రులు..!

గతకొన్ని రోజులుగా బ్రిటన్‌ వ్యాప్తంగా వైరస్‌ తీవ్రత పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో చేరే వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఉన్న యాక్టివ్‌ కేసులతో ఆసుపత్రులు నిండిపోయాయి. అక్కడి అధికారిక గణంకాల ప్రకారం, గతవారం లక్షా 16వేల మంది వైరస్‌ సోకిన వారుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,24,000కు చేరింది. మరికొన్ని రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, వైరస్‌ సంక్రమణ చిన్నారుల్లో తక్కువగా కనిపించడం ఉపశమనం కలిగించే విషయం అని అధికారులు పేర్కొన్నారు.

ఆంక్షలు మరింత కఠినతరం.. 

యూకేలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం కఠిన నిబంధనలను అమలు చేయాలని ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భావిస్తున్నారు. దీనిపై అక్కడి పార్లమెంట్‌లో ఓ విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దీనిలో భాగంగా 3-టైర్‌ విధానంలో ఆంక్షలను విధించేందుకు యూకే ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా వైరస్‌ నియంత్రణలో స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వడం, సోషల్‌ కాంటాక్ట్‌పై ఆంక్షలు విధించడం,‌ వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లను మూసివేయడం వంటి చర్యలకు యూకే ప్రభుత్వం ఉపక్రమించనుంది. ఇప్పటికే కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై భారీగా జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని లండన్‌లో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేయడం అనివార్యమని లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ హెచ్చరించారు. యూకేలో ఇప్పటివరకు 5,93,574 కేసులు నమోదుకాగా వీరిలో 42,850 మంది మృత్యువాతపడ్డారు. అయితే, ఇక్కడ కోలుకున్న వారిసంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ప్రస్తుతం అక్కడ దాదాపు 4లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు సమాచారం.

Advertisement


మరిన్ని