భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త

హెచ్‌ 1బీ వీసాల నిషేధానికి చెక్‌

వాషింగ్టన్‌: ట్రంప్‌ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన హెచ్‌ 1బీ తదితర వీసాల తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అమెరికా ఫెడరల్‌ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అధికార పరిధిని మీరి ప్రవర్తించారని కోర్టు అభిప్రాయపడింది. వీసాలపై నిషేధాన్ని రద్దు చేయాలంటూ ఉత్తర కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్‌ ఇచ్చిన తీర్పు తక్షణమే అమలులోకి రానుంది. కాగా, ఈ కీలక తీర్పుతో భారత్‌కు చెందిన వేలాది ఐటీ నిపుణులకు మేలు కలగనుంది.

పలు అమెరికా సంస్థల్లో ఉన్నత నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలలో విదేశాలకు చెందిన వ్యక్తులను నియమించేందుకు అవకాశం కలిగించే హెచ్‌ 1బీ, వ్యవసాయేతర కార్మికుల కోసం ఇచ్చే హెచ్‌ 2బీ, కళాకారులకు సంబంధించిన జే, మేనేజర్ల కోసం ఉద్దేశించిన ఎల్‌ తరహా వీసాల జారీని ఈ సంవత్సరాంతం వరకు నిలిపివేస్తూ ట్రంప్‌ జూన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా, నిరుద్యోగులైన అమెరికన్‌ పౌరులకు మేలు కలిగించేందుకే తాము ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

అయితే ఈ నిర్ణయంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ చర్య వల్ల పలు కీలక పదవుల్లో అత్యవసరమైన మానవ వనరుల లభ్యత కష్టం అవుతుందని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యానుఫాక్చరర్స్‌ అభిప్రాయపడింది. అంతేకాకుండా దేశ ఆర్థిక పురోగతి కుంటుపడుతుందని పలువురు అత్యున్నత సాంకేతిక నిపుణులు హెచ్చరించారు.మరిన్ని