అమెరికాలో ఒక్కరోజే 2500 కొవిడ్‌ మరణాలు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో ఒక్కరోజే 2500 కొవిడ్‌ మరణాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 2,500 మందికి పైగా వైరస్‌కు బలయ్యారు. ఏప్రిల్‌ తర్వాత అమెరికాలో ఒక రోజులో ఇంత అత్యధిక మరణాలు చోటుచేసుకోవడం మళ్లీ ఇప్పుడే అని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు 1,80,000లకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది. చివరిసారిగా ఏప్రిల్‌లో మహమ్మరి తీవ్రంగా విజృంభించిన సమయంలో ఒక్క రోజులోనే 2,562 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మంగళవారమే ఇంత ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించాయని యూనివర్శిటీ తెలిపింది.

అగ్రరాజ్యంలో ఇప్పుడు పండగ సీజన్‌. గత కొద్ది రోజులుగా అమెరికన్లు తమ బంధువులను కలుసుకునేందుకు విపరీతమైన ప్రయణాలు చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలు పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా వేడుకలు చేసుకుంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి మరింత విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 1.37కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవగా.. 2,70,000లకు పైగా మరణాలు సంభవించాయి. 

మరోవైపు అమెరికాలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితి కింద టీకాకు అనుమతి ఇవ్వాలంటూ ఫైజర్‌ సంస్థ ఇటీవల అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై డిసెంబరు 10న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఫైజర్‌కు అనుమతి లభిస్తే.. ఆ మరుసటి రోజు నుంచే టీకా పంపిణీ ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది.  


మరిన్ని