ఫేస్‌బుక్‌పై అమెరికా పోరు 
ఫేస్‌బుక్‌పై అమెరికా పోరు  

వాట్సాప్‌, ఇన్‌స్టాలను అమ్మక తప్పదా?

వాషింగ్టన్: సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు గట్టి షాక్‌ తగిలింది. వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించి చిన్న చిన్న ప్రత్యర్థి సంస్థలను అణిచేస్తోందంటూ అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం, 48 రాష్ట్రాలు ఈ కంపెనీపై న్యాయస్థానాల్లో దావా వేశాయి. దీంతో ఫేస్‌బుక్‌ తన అనుబంధ విభాగాలైన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను విక్రయించాల్సి వచ్చే పరిస్థితి ఎదురైంది. అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌(ఎఫ్‌టీసీ), 48 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ ఈ దావా వేశారు. 

తన ఏకఛత్రాధిపత్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు ఫేస్‌బుక్‌ ఓ వ్యవస్థీకృత వ్యూహాన్ని అనుసరిస్తోందని గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నిబంధనలను పక్కనబెట్టి చిన్న చిన్న ప్రత్యర్థి సంస్థలకు డబ్బు ఆశ చూపించి కొనుగోలు చేస్తుందని ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ ఆరోపిస్తోంది. 2012లో తనకు ప్రత్యర్థిగా మారిన ఇన్‌స్టాగ్రామ్‌ను, 2014లో వాట్సాప్‌ మొబైల్‌ మెజేసింగ్‌ యాప్‌ను అలాగే కొనుగోలు చేసిందని తెలిపింది. ఫేస్‌బుక్‌ తీరు పోటీతత్వానికి ప్రమాదకరమని, దీని వల్ల వినియోగదారులకు ఎంపిక అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఫెడరల్‌ కమిషన్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. దాదాపు దశాబ్దం కాలంగా ఫేస్‌బుక్‌ తన గుత్తాధిపత్యాన్ని ఉపయోగించి చిన్న చిన్న ప్రత్యర్థులను తొక్కేస్తూ పోటీ లేకుండా చేసుకుంటోందని ఆరోపించింది. ఫేస్‌బుక్‌ ఈ విధానాలను పాటించకుండా ఆంక్షలు విధించాలని, వ్యక్తిగత నెట్‌వర్కింగ్‌లో పోటీని పునరుద్ధరించాలని కమిషన్‌ న్యాయస్థానాన్ని కోరింది. 

ఈ ఆరోపణలను ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడింగ్‌ జెన్నిఫర్‌ న్యూస్టెడ్‌ తిరస్కరించారు. ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలను పాల్పడుతోందని దుయ్యబట్టారు. మరోవైపు కంపెనీపై దావాలు వేయడంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఫేస్‌బుక్ షేర్లు పతనమయ్యాయి. కాగా.. ఈ ఏడాది అమెరికాలో న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న రెండో అతిపెద్ద టెక్‌ కంపెనీ ఫేస్‌బుక్‌ కావడం గమనార్హం. అక్టోబరులో గూగుల్‌ ఆల్ఫాబెట్‌పై కూడా ఇలాంటి దావాలే వేశారు. 

ప్రపంచంలోనే దిగ్గజ సోషల్‌మీడియా సంస్థ అయిన ఫేస్‌బుక్‌.. 2012 ఏప్రిల్‌లో ఒక బిలియన్‌ డాలర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2014 ఫిబ్రవరిలో 19 బిలియన్‌ డాలర్లు చెల్లించి వాట్సాప్‌ను తన సంస్థలో కలుపుకుంది. దీంతో అప్పటి నుంచి ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి..

ఇలా అయితే మేం పాక్‌ నుంచి వెళ్లిపోతాం

ఫేక్‌న్యూస్‌ కట్టడికి ఫేస్‌బుక్‌ ఏం చేసిందంటే..

Advertisement

Advertisement


మరిన్ని