చైనా నుంచి 233మంది భారతీయులు వెనక్కి!
చైనా నుంచి 233మంది భారతీయులు వెనక్కి!

కొనసాగుతున్న వందే భారత్‌ మిషన్‌
ఇప్పటికే 9 లక్షల 39 వేల మంది భారతీయులు స్వదేశానికి

దిల్లీ: కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా విమానయాణంపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే వందే భారత్‌ మిషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదో దశలో భాగంగా భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నారు. తాజాగా చైనా నుంచి మరో 233మంది భారతీయులు స్వదేశానికి బయలుదేరారు. చైనాలోని గాంగ్‌ఝౌ నుంచి ప్రత్యేక ఎయిర్‌ఇండియా విమానంలో వీరు దిల్లీకి ప్రయాణమైనట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే, పౌరవిమానయాన శాఖ చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ ప్రస్తుతం ఐదో దశ కొనసాగుతున్నట్లు కేంద్రమంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ మార్గాల్లో ఇప్పటికే 9 లక్షల 39 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మరో లక్షా 20వేల మంది వివిధ దేశాలకు తరలివెళ్లినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభమైన వందే భారత్‌ మిషన్‌ ఫేజ్‌-5 ఈ నెల 31వరకు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇవీ చదవండి..
వందే భారత్‌ మిషన్‌: 9లక్షల మంది స్వదేశానికి..!
చైనా..ఆ ప్రయత్నాలు మానుకో: కేంద్రం


మరిన్ని