306: అప్పుడు ట్రంప్‌.. ఇప్పుడు బైడెన్‌కు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
306: అప్పుడు ట్రంప్‌.. ఇప్పుడు బైడెన్‌కు

వాషింగ్టన్‌: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. ఫలితాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని బైడెన్‌ సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించాయి అమెరికా ప్రధాన మీడియా సంస్థలు. కాగా.. శుక్రవారం నాటికి అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. కీలకమైన జార్జియా డెమొక్రాట్ల వశమవగా.. ఉత్తరకరోలినాలో ట్రంప్‌ గెలిచినట్లు యూఎస్‌ మీడియా వెల్లడించింది. తాజా ఫలితాలతో బైడెన్‌ ఖాతాలో 306 ఎలక్టోరల్‌ ఓట్లు చేరగా.. ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి. అయితే అచ్చం 2016 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే రావడం గమనార్హం. కానీ, అప్పుడు ట్రంప్‌ 306 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి అధ్యక్ష పీఠం అధిరోహించగా.. అప్పటి డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను 232 ఓట్లు వచ్చాయి. 

జార్జియా డెమొక్రాట్ల వశం..

మూడు దశాబ్దాల పాటు రిపబ్లికన్లు అధికారంలో ఉన్న జార్జియా ఇప్పుడు డెమొక్రాట్ల వశమైంది. ఇక్కడ 99శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బైడెన్‌ విజయం సాధించారు. ఫలితాల్లో బైడెన్‌కు 49.5శాతం ఓట్లు రాగా.. ట్రంప్‌కు 49.2శాతం పోలయ్యాయి. దీంతో ఇక్కడి 16 ఎలక్టోరల్‌ ఓట్లు బైడెన్‌కు దక్కాయి. అయితే ప్రధాన అభ్యర్థుల మధ్య తేడా 0.5శాతం కంటే తక్కువగా ఉండటంతో ఇక్కడ రీకౌంటింగ్‌ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. చివరిసారిగా 1992లో డెమొక్రాటిక్ అధ్యక్ష‌ అభ్యర్థి బిల్‌ క్లింటన్‌ జార్జియాలో గెలుపొందారు. ఆ తర్వాత నుంచి రిపబ్లికన్లే గెలుపొందుతూ వస్తున్నారు. 

ఇక ఉత్తర కరోలినాలో ట్రంప్‌ గెలుపొందారు. అక్కడ ట్రంప్‌కు 50శాతం ఓట్లు రాగా.. బైడెన్‌కు 48.6శాతం ఓట్లు పోలయ్యాయి. అటు అలస్కాలోనూ ట్రంప్‌ విజయం సాధించారు. దీంతో ట్రంప్‌ మొత్తం ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య 232కు చేరింది. బైడెన్‌ 306 ఎలక్టోరల్‌ ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

బైడెన్‌ గెలిచిన రాష్ట్రాలివే..

వాషింగ్టన్‌, ఓరెగాన్‌, కాలిఫోర్నియా, నెవాడా, అరిజోనా, కొలరాడో, న్యూ మెక్సికో, మిన్నెసోటా, విస్కన్సిన్‌, ఇల్లినాయిస్‌, మిషిగాన్‌, జార్జియా, మైన్‌, వెర్మాంట్‌, న్యూ హాంప్‌షైర్‌, మసాచుసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌, కనెక్టికట్‌, న్యూజెర్సీ, డెలావేర్‌, మేరీల్యాండ్‌, న్యూయార్క్‌, పెన్సిల్వేనియా, వర్జీనియా, హవాయి రాష్ట్రాల్లో బైడెన్‌ విజయం సాధించారు. 

ట్రంప్‌ గెలిచిన రాష్ట్రాలివే..

మోంటానా, ఇదాహో, ఉతాహ్‌, వ్యోమింగ్‌, నార్త్‌ డకోటా, సౌత్‌ డకోటా, నెబ్రస్కా, కాన్సాస్‌, ఓఖ్లహోమా, టెక్సాస్‌, ఇయోవా, మిస్సోరీ, అర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, ఓహైయో, వెస్ట్‌ వర్జీనియా, కెంటుకీ, టెన్నిసీ, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, మిస్సిస్సీపీ, అలబామా, ఫ్లోరిడా, అలస్కా రాష్ట్రాల్లో ట్రంప్‌ ఎలక్టోరల్‌ ఓట్లు గెలిచారు. 

ఆసక్తికర విషయమేంటంటే.. ట్రంప్‌, బైడెన్‌ ఇద్దరూ చెరో 25 రాష్ట్రాల్లో ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. కాగా.. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్‌ ఫలితాలపై న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బైడెన్‌ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. 


మరిన్ని