ట్రంప్‌.. ఓ చెత్త అధ్యక్షుడు: ఆర్నాల్డ్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ట్రంప్‌.. ఓ చెత్త అధ్యక్షుడు: ఆర్నాల్డ్‌

ఆందోళనకారులను నాజీలతో పోల్చిన హాలీవుడ్‌ హీరో

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ విఫల నేత అని ప్రముఖ హాలీవుడ్‌ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్‌ ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ విమర్శించారు. చరిత్రలోనే ఆయనో చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోనున్నారని దుయ్యబట్టారు. అమెరికా క్యాపిటల్‌ భవనంపై గతవారం జరిగిన దాడిపై సోషల్‌మీడియా వేదికగా స్పందించిన ఆయన.. నిరసనకారులను నాజీలతో పోల్చారు. ఈ మేరకు ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు. 

‘‘అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల గురించి తోటి అమెరికన్లకు, స్నేహితులకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. నేను ఆస్ట్రియాలో పుట్టి పెరిగాను. 1938లో జరిగిన ‘క్రిస్టల్లానాచ్‌ లేదా నైట్‌ ఆఫ్‌ బ్రోకెన్‌ గ్లాస్‌’ గురించి నాకు బాగా తెలుసు. జర్మనీకి చెందిన నాజీలు ఆస్ట్రియాలోని యూధుల ఇళ్లపై దాడి చేసి విధ్వంసం  సృష్టించారు. అమెరికాలోని ప్రౌడ్‌ బాయ్స్‌(క్యాపిటల్‌ భవనంపై దాడి చేసిన ట్రంప్‌ మద్దతుదారుల గ్రూప్‌ పేరు) కూడా నాజీల్లాంటి వారే. గత బుధవారం చోటు చేసుకున్న ఘటన అమెరికా ‘డే ఆఫ్‌ బ్రోకెన్‌ గ్లాస్‌’. ఇక్కడ పగిలిన అద్దం క్యాపిటల్‌ భవనం కిటికీది. అయితే తాజా ఘటనలో ఆందోళనకారులు పగలగొట్టింది కేవలం కిటికీ అద్దం మాత్రమే కాదు.. కాంగ్రెస్‌ చట్టసభ్యుల ఆలోచనలు కూడా పగలగొట్టారు. ప్రజాస్వామ్య విలువలను, విధానాలను తొక్కేశారు’’ అని ఆర్నాల్డ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ట్రంప్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ ఓ విఫల నేత అని, చరిత్రలోనే ఆయనో చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. అమెరికా రాజ్యాంగాన్ని తిరగరాయాలనుకునే వారు ఎప్పటికీ గెలవలేరన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్‌ అమెరికా ఏకతాటిపైకి వచ్చి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు సంపూర్ణ మద్దతు అందించాలని కోరారు. 

ఆస్ట్రియాకు చెందిన ఆర్నాల్డ్‌ కుటుంబం అమెరికాకు వలసవచ్చింది. టర్మినేటర్‌ వంటి చిత్రాలతో ఈయన హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో కాలిఫోర్నియాకు గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆర్నాల్డ్‌ కూడా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ట్రంప్‌పై ఆర్నాల్డ్‌ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు.

ఇవీ చదవండి..

అడకత్తెరలో ట్రంప్‌

కమలా హ్యారిస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా సబ్రీనామరిన్ని