అలరించిన అంతర్జాతీయ మహిళా అష్టావధానం
అలరించిన అంతర్జాతీయ మహిళా అష్టావధానం

విజయవాడ: ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో జూమ్‌- ఫేస్‌బుక్‌ వేదికగా ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా అష్టావధాన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. బులుసు అపర్ణ అష్టావధానిగా, దేశ విదేశాల నుంచి 8 మంది మహిళలు పృచ్ఛకులుగా వ్యవహరించారు. ఐదు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు ఆత్మ వంటిదని, ఈ కళపై యువతకు అవగాహన కలిగించాలని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌ అన్నారు. జిల్లా స్థాయిలో తెలుగు భాషా వికాస కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బులుసు అపర్ణను అత్యంత ప్రతిభాశాలి అని కొనియాడారు. అవధానం, పద్యం తెలుగు వారి ఆస్తి అని, ఈ వారసత్వ సంపదను రాబోయే తరాలకు అందజేయాలని ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ సంపాదకులు మానుకొండ నాగేశ్వరరావు అన్నారు.

అష్టావధానాన్ని అభినందిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక సందేశం పంపించారు. జస్టిస్‌ భవానీ ప్రసాద్‌, మానుకొండ నాగేశ్వరరావు బులుసు అపర్ణను ‘అవధాన విద్వన్మణి’ బిరుదుతో సత్కరించారు. మా శర్మ, డాక్టర్‌ మధు కొర్రపాటి (న్యూయార్క్‌), వడలి రమేష్‌ (శాక్రమెంటో) అతిథులుగా పాల్గొన్నారు. కడిమెళ్ల వరప్రసాద్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. డాక్టర్‌ కోరుకొండ సుజాతాదేవి (రాజమహేంద్రవరం), కడిమెళ్ల మీనాక్షి (నర్సాపురం), డాక్టర్‌ కేటీ పద్మజ (అమలాపురం), డాక్టర్‌ ఎంబీడీ శ్యామల (తాడికొండ), డాక్టర్‌ తాడేపల్లి వీరలక్ష్మి (పెనుగొండ), రాధిక మంగిపూడి (సింగపూర్‌), అరవిందారావు పారనంది (ఇంగ్లాండ్‌), అమరవాది మృణాళిని (గజ్వేల్‌) మహిళా పృచ్ఛకులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. తొలుత డాక్టర్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ కొల్లూరి స్వాగతం పలకగా.. రాయప్రోలు భగవాన్‌ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమాన్ని కొప్పవరపు కవులకు అంకితమిచ్చినట్లు ఆంధ్ర సారస్వత పరిషత్‌ కార్యదర్శి రెడ్డప్ప ధవెజి తెలిపారు.


మరిన్ని