భారతీయ ప్రతిభకు నాసాలో ‘భవ్య’ స్థానం
భారతీయ ప్రతిభకు నాసాలో ‘భవ్య’ స్థానం

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్ల ప్రతిభకు అగ్రరాజ్యంలో పెద్దపీట వేస్తున్నారు. బైడెన్‌ ప్రభుత్వంలో పలువురు భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు లభించిన విషయం తెలిసిందే. వీరిలో పలువురు మహిళలు కూడా ఉండటం విశేషం. ఇక తాజాగా భారత సంతతికి చెందిన మహిళకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో కీలక స్థానం లభించింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న భవ్యా లాల్‌ నాసా యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమితులయ్యారు. ఆమె ఇటీవలి వరకు అధ్యక్ష అధికార బదలాయింపు వ్యవహారాలు నిర్వహించిన ‘బైడెన్‌ ప్రెసిడెన్షియల్‌ ట్రాన్సిషన్‌ ఏజన్సీ రివ్యూ టీమ్‌’ సభ్యురాలిగా వ్యవహరించారు. ఇంజినీరింగ్‌, అంతరిక్ష విజ్ఞాన రంగాల్లో భవ్య సుదీర్ఘ అనుభవం ఉపయోగపడుతుందని నాసా ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

భారత సంతతికి చెందిన ఈ మహిళా శాస్త్రవేత్త పలు అమెరికా ప్రభుత్వ సంస్థల్లో కీలక పదవులు నిర్వహించారు. 2005 నుంచి 2020 వరకు ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ అనాలసిస్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధనా సంస్థల్లో సభ్యురాలిగా సేవలందించారు. ఇంకా, వైట్‌హౌజ్‌కు చెందిన ఆఫీస్‌ ఆఫ్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ, నేషనల్‌ స్పేస్‌ కౌన్సిల్‌లకు విశ్లేషకుల బృందానికి నేతృత్వం వహించారు. అంతరిక్ష సాంకేతిక విధాన సంఘం క్రియాశీలక సభ్యురాలిగా, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన ఐదు కమిటీలకు సభ్యురాలిగా, అధ్యక్షురాలిగా కీలక పదవుల్లో ఉన్నారు. ఆమె నాసాలో వివిధ బాధ్యతలను నిర్వహించారు.

భవ్యా లాల్‌ మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, మాస్టర్స్‌తో పాటు టెక్నాలజీ అండ్‌ పాలసీ విభాగంలో కూడా మరో మాస్టర్స్‌ పట్టాను అందుకున్నారు. జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్‌ పాలసీ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో డాక్టరేట్‌ పూర్తి చేశారు. న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌ సొసైటీ, పబ్లిక్‌ పాలసీ సొసైటీ రెండింటిలో కూడా ఆమెకు గౌరవ సభ్యత్వం ఉంది. అంతరిక్ష రంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను, ఇంటర్నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆస్ట్రోనాటిక్స్‌ గౌరవ సభ్యురాలిగా భవ్య ఎన్నికయ్యారు.

ఇవీ చదవండి..

తానా ఎన్నికల షెడ్యూలు విడుదల

కీలక పదవుల్లో భారత సంతతి మహిళలు


మరిన్ని