ట్రంప్‌పై 9/11 తరహా కమిషన్‌!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ట్రంప్‌పై 9/11 తరహా కమిషన్‌!

 ఊపందుకుంటోన్న డిమాండ్‌

 మద్దతు తెలుపుతున్న రిపబ్లికన్లు 

వాషింగ్టన్‌: క్యాపిటల్‌ హింసాకాండ చిక్కుల్లోంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయటపడేలా కనిపించడం లేదు. అభిశంసన నుంచి గట్టెక్కినా ఆయనకు మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు 9/11 దాడి చేసినపుడు ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు కమిషన్‌ తరహాలోనూ క్యాపిటల్‌ భవనంపై దాడిపైనా విచారణ చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. దీనికి డెమొక్రాట్లతో పాటు.. రిపబ్లికన్లూ మద్దతిస్తుండడం విశేషం. ‘‘ఏం జరిగిందనే విషయంపై సమగ్ర విచారణ జరపాలి. ఈ ఘటనపై ఎవరికి సమాచారం ఉంది, ఎప్పటి నుంచి ఉంది..లాంటి అన్ని విషయాలు బయటకు రావాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయి’’ అని రిపబ్లికన్‌ సెనేటర్‌ బిల్‌ కాసిడీ అన్నారు. 

క్యాపిటల్‌ ముట్టడి తర్వాత తప్పుచేశానన్న అపరాధభావం ట్రంప్‌లో ఉందని ఎగువ సభలో అభిశంసనకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌ చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదంటే 9/11 వంటి కమిషన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఆధారాలు ఉన్నాయని డెమొక్రటిక్‌ సెనేటర్‌ క్రిస్‌ కూన్స్‌ పేరొన్నారు. క్యాపిటల్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు ఈ దర్యాప్తు ఓ మార్గమని అన్నారు. రాజ్యాంగ ప్రమాణాన్ని అధ్యక్షుడు ఎంత బాధ్యతాయుతంగా ఉల్లంఘించారో అన్న విషయాన్ని తేటతెల్లం చేయవచ్చని ఎద్దేవా చేశారు. సెప్టెంబర్‌ 11 దాడి తరహా కమిషన్‌ ఏర్పాటు చేయాలంటే కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. తద్వారా విచారణ అత్యున్నత స్థాయిలో జరుగుతుంది. ఇలాంటి కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇప్పటికే మద్దతు తెలిపారు.


మరిన్ని