వెళ్లేముందు అభాసుపాలు!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వెళ్లేముందు అభాసుపాలు!

అధ్యక్షుడి అధికారాన్ని తిరగరాసిన కాంగ్రెస్‌

వాషింగ్టన్‌: కీలక విషయాల్లో ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అక్కడి కాంగ్రెస్‌ బుద్ధి చెప్పింది. కీలక రక్షణ బిల్లుపై అభ్యంతరాలు చెబుతూ జాప్యానికి కారణమవుతున్న ఆయన వీటో అధికారాన్ని కాంగ్రెస్‌ తిరగరాసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష స్థానం నుంచి దిగిపోనున్న ట్రంప్‌నకు ఇది ఒకరకంగా అవమానకరమైన విషయమనే చెప్పాలి. అలాగే ఈ ఘటన కాంగ్రెస్‌తో పాటు సొంత పార్టీ రిపబ్లికన్‌పై ట్రంప్‌ పట్టు కోల్పోతున్న అంశాన్ని సూచిస్తోంది.  

అధ్యక్షుడి వీటో అధికారాన్ని తిరగరాసేందుకు సెనేట్‌లో మూడొంతుల మంది సభ్యుల ఆమోదం తప్పనిసరి. అందుకనుగుణంగా.. 81-13 ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్‌ సొంత పార్టీ అయిన రిపబ్లికన్‌ సభ్యులు కూడా ఆయన వీటోను తోసిపుచ్చారు. అంతుకుముందు ప్రతినిధుల సభలోనూ ఇదే సన్నివేశం చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన ట్రంప్‌.. ‘మెరుగైన రక్షణ బిల్లును ప్రతిపాదించే అవకాశాన్ని సెనేట్‌ చేజార్చుకొంది’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్న తమ సైనికులను తిరిగి అమెరికాకు తీసుకురావాలన్న తన నిర్ణయానికి తాజా బిల్లు వ్యతిరేకంగా ఉందని ట్రంప్‌ ఆరోపిస్తూ వచ్చారు.

అధ్యక్షుడి వీటోను తిరగరాస్తూ బిల్లుకు కాంగ్రెస్‌ ఆమోదం లభించడంతో అది చట్టంగా మారింది. దీంతో 740.5 బిలియన్‌ డాలర్ల రక్షణ విధానానికి మార్గం సుగమమైంది. లక్షలాది మంది అమెరికా సైనికులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందనున్నాయి. ఇప్పటి వరకు ‘హాజార్డస్‌ డ్యూటీ పే’ కింద చెల్లించిన నెలవారీ భృతిని 250 డాలర్ల నుంచి 275 డాలర్లకు పెంచనున్నారు. అలాగే ఆయుధాల సమీకరణ కొనసాగనుంది. కొత్తగా చేపట్టిన సైనికపరమైన నిర్మాణాలు ముందుకు సాగనున్నాయి. మరో ఎనిమిది బిల్లులను కూడా ట్రంప్‌ తన వీటో అధికారంతో అడ్డుకున్నారు. కానీ, చట్టసభల్లో మూడొంతుల మెజార్టీ సాధించడంలో విఫలమవడంతో అవి చట్టంగా మారలేదు.

ఇదీ చదవండి..

అమెరికా కలలపై అశనిపాతంమరిన్ని