గాంధీవిగ్రహం అపవిత్రంపై అమెరికా‌ మండిపాటు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గాంధీవిగ్రహం అపవిత్రంపై అమెరికా‌ మండిపాటు

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేయడాన్ని శ్వేతసౌధం తీవ్రంగా ఖండించింది. దీన్ని ఘోరమైన చర్యగా అభివర్ణించిన వైట్‌ హౌజ్‌ అధికార ప్రతినిధి కేలీ మెకనీ.. ఇలాంటి దుశ్చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. గాంధీజీ ప్రతిష్ఠను గుర్తించి ప్రతిఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు సంఘీభావంగా అమెరికాలో సిక్కు వర్గాలు నిర్వహించిన ర్యాలీలో ఖలిస్థానీ వేర్పాటువాదులు దూరి గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా ఖండించిన భారత వర్గాలు అమెరికా విదేశాంగ దృష్టికి తీసుకెళ్లడంతో వైట్‌హౌజ్‌ తాజాగా స్పందించింది.

‘‘గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేయడం భయంకరమైన చర్య. ఏ విగ్రహాన్ని, స్మారకాన్ని ముఖ్యంగా శాంతి, అహింస, స్వేచ్ఛ వంటి అమెరికా విలువలకు గౌరవం తీసుకొచ్చిన గాంధీజీ వంటి విగ్రహాలను అపవిత్రం చేయడం సహించలేని చర్య. ముఖ్యంగా అమెరికాలో ఆయన ప్రతిష్ఠను మరింత గౌరవించాల్సిన అవసరం ఉంది’’ అని మెకనీ అభిప్రాయపడ్డారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. భారత రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. అమెరికా విదేశీ కార్యాలయాలు, ఆస్తులకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని ఉద్ఘాటించారు. గాంధీ విగ్రహ అపవిత్ర ఘటనపై భారత రాయబార కార్యాలయంతో చర్చిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి..

అమెరికాలో గాంధీ విగ్రహం అపవిత్రం


మరిన్ని