రెండో డోసుకూ అదే ప్రాధాన్యత: ఆంటోని ఫౌచీ
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రెండో డోసుకూ అదే ప్రాధాన్యత: ఆంటోని ఫౌచీ

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ధాటికి వణికిపోతోన్న అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్‌  ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సమయంలో మొదటి డోసును వీలైనంత ఎక్కువ మందికి అందించడంతో పాటు రెండో డోసు వారికీ ప్రాధాన్యత కల్పించాలని అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్‌ ఆంటోని ఫౌచీ సూచించారు. అమెరికా అధ్యక్ష భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యాక్సిన్‌ రెండో డోసును అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ఇస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు.

కరోనా వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో అందిస్తోన్న అమెరికాలో ఇప్పటివరకు రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ రెండు వ్యాక్సిన్‌లు కూడా తొలి డోసులోనే అంచనా కంటే ఎక్కువగానే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆంటోని ఫౌచీ వెల్లడించారు. ఇక రెండో డోసుతో మరింత సామర్థ్యం లభిస్తుందని పేర్కొన్నారు. మొదటి డోసుతోనే అవసరమైన యాంటీబాడీలు ఉత్పత్తి అయినప్పటికీ కొత్త రకాలను ఎదుర్కొనే సామర్థ్యం రెండో డోసుతోనే లభించే అవకాశం ఉందని ఆంటోని ఫౌచీ స్పష్టంచేశారు. అందుకే డోసు నిర్లక్ష్యం చేయకుండా, నిర్దేశిత సమయంలో వ్యాక్సిన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా రకాల వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆంటోని ఫౌచీ సూచిస్తున్నారు. రెండు డోసులుగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్‌ను, కేవలం ఓకే డోసు తీసుకున్నట్లయితే, వైరస్‌ను నాశనం చేసే శక్తి రాకపోగా, కొత్తరకం వైరస్‌లకు కారణమయ్యే మ్యుటేషన్‌కు ఆహ్వానం పలికినట్లేనని ఫౌచీ అభిప్రాయపడ్డారు.

బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కేసులు @700
విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతోన్న బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌ అమెరికాలో 700మందిలో వెలుగు చూసినట్లు వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) వెల్లడించింది. అయితే, గత కొంతకాలంగా అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసులు సంఖ్య గణనీయంగా తగ్గుతోందని సీడీసీ తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే గతవారంలోనే కొత్త కేసుల సంఖ్య 20శాతం తగ్గినట్లు సీడీసీ పేర్కొంది.   

ఇవీ చదవండి..
హెచ్‌-1బి వీసా: ప్రస్తుతానికి లాటరీ విధానమే
ట్రంప్‌ హోటల్‌కు రూ.87కోట్ల జరిమానా?


మరిన్ని