కరోనాపై పోరులో వెనుకబడ్డ అమెరికా
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కరోనాపై పోరులో వెనుకబడ్డ అమెరికా

ఇక్కడి ప్రజలకు తీవ్రత తెలియడంలేదు
వారంలో లక్షన్నర కేసులు పెరిగాయ్‌
అందరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలి
‘ఈనాడు ప్రతినిధి’తో డాక్టర్‌ లోకేశ్‌ ఈదర

కరోనాను ఎదుర్కోవడంలో అమెరికా నాలుగు వారాలు వెనుకబడి ఉందని, ఇప్పటికీ ప్రజలు తీవ్రతను అర్థం చేసుకోలేదని అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఛైర్మన్‌గా, మిచిగాన్‌లో ఇమ్యునాలజీ నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ లోకేశ్‌ ఈదర అభిప్రాయపడ్డారు. గత శుక్రవారం అమెరికాలో కరోనా బాధితులు లక్ష మంది ఉంటే మళ్లీ శుక్రవారం వచ్చేటప్పటికి 2.5లక్షలమంది అయ్యారని పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే తీసుకొన్న చర్యలతో పాటు    ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం ద్వారా వైరస్‌ విస్తరించకుండా చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితిపై ఆయన    శుక్రవారం ‘ఈనాడు ప్రతినిధి’తో మాట్లాడారు.

మరణాల సంఖ్య పెరిగే అవకాశం
అమెరికాలో ప్రతి పది లక్షల మందికి 740 పాజిటివ్‌ కేసులున్నాయి. మరణాలు 18 ఉన్నాయి. దేశం మొత్తమ్మీద 2.45 లక్షల పాజిటివ్‌ కేసులు వస్తే ఆరువేల మంది మరణించారు. వీటిసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. నాలుగు వారాల ముందే మేల్కొని కట్టడి చేయగలిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జపాన్‌లో 10 లక్షల మందికి 20 కేసులే నమోదవుతున్నాయి. మాస్క్‌లు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు గత 10 రోజులుగా చెబుతున్నాం. నిన్ననే లాస్‌ ఏంజిల్స్‌లో తప్పనిసరి చేశారు. టెక్సాస్‌లో పెట్టుకోకుంటే వెయ్యి డాలర్ల జరిమానా వేస్తామని ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ఒక తెలుగబ్బాయి మాస్క్‌ పెట్టుకొని బ్యాంకుకెళ్తే అనారోగ్యంగా ఉన్నాడని వెనక్కు జరగమన్నారు. అంటే సమస్య తీవ్రతను గుర్తించలేదని స్పష్టమవుతోంది.  భారత్‌లో మాత్రం లాక్‌డౌన్‌ బాగాచేశారు.

న్యూయార్క్‌లో కేసులన్నీ పాజిటివ్‌వే
బోస్టన్‌ నుంచి ఓ తెలుగు పల్మనాలజిస్టు ఫోన్‌లో నాతో మాట్లాడుతూ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. న్యూయార్క్‌లో వచ్చే కేసులన్నీ పాజిటివ్‌వే ఉంటున్నాయి. పరీక్షలు చేయడం కష్టంగా ఉందన్నారు. 1.65 లక్షల నమూనాలు పరీక్షల కోసం ల్యాబ్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఇది ఎకనామిక్‌ డిజాస్టర్‌. ఒక రాష్ట్రంలో మూడు రోజుల్లో వరుసగా 24 వేలు, 26 వేలు, 29 వేలు.. అంటే రోజురోజుకూ ఎలా పెరుగుతున్నాయో చూడండి. భారత్‌లో తీవ్రతను అర్థం చేసుకొని అందరూ మాస్క్‌లు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.

Tags :

మరిన్ని