అమెరికాలో ఆగని మృత్యుఘోష
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో ఆగని మృత్యుఘోష

ఒక్క రోజులోనే 1100 మంది కన్నుమూత
న్యూయార్క్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు మృతి
వాషింగ్టన్‌, పారిస్‌

మహమ్మారి కొవిడ్‌-19 వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. కొద్ది రోజులుగా అక్కడ మృత్యువు కరాళనృత్యం చేస్తోంది. శనివారం  ఒక్కరోజే 1100 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో మరే దేశంలోనూ 24 గంటల్లో ఇంత ప్రాణనష్టం వాటిల్లలేదు. న్యూయార్క్‌ రాష్ట్రంలో 630 మంది కన్నుమూశారు. అంటే ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చనిపోయినట్లు లెక్క. స్పెయిన్‌, ఇటలీ, బ్రిటన్‌లలో మృతుల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు ముఖాలకు వస్త్రాలు తప్పనిసరిగా చుట్టుకోవాలని, లేదా ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులనైనా ఉపయోగించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. వైద్యపరమైన మాస్కులను మాత్రం వైద్య సిబ్బంది కోసం వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ శ్వాస ద్వారా, లేదా దగ్గు/తుమ్ము ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని తన సలహాదారుడు, జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ అధిపతి అంటోనీ ఫాసీ చెప్పిన నేపథ్యంలో ట్రంప్‌ శనివారం ఈ సూచన చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అదనపు జాగ్రత్తలు చెప్పిన ట్రంప్‌... తాను మాత్రం మాస్క్‌ ధరించబోనని తేల్చిచెప్పారు. ముఖానికి మాస్కుతో అధ్యక్ష కార్యాలయంలో కూర్చుని వివిధ దేశాధినేతలకు అభివాదం చేయడం తనకెందుకో నచ్చదన్నారు.

ఆర్థిక వ్యవస్థకు విఘాతం: ఏడీబీ
ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య 11.30 లక్షలు దాటింది. వీరిలో దాదాపు 2.11 లక్షల మంది కోలుకున్నారు. తాజా గణాంకాలను బట్టి దాదాపు 60 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో ఒక్కరోజులో 809 మంది చనిపోయారు. ఇటలీలోనూ 766 మంది చనిపోయినా కొత్తగా వైరస్‌ బారిన పడినవారి సంఖ్య నాలుగు శాతమే పెరిగింది. యూకేలో వరసగా నాలుగోరోజూ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. బ్రిటన్‌ను, కామన్వెల్త్‌ దేశాలను ఉద్దేశించి బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ఆదివారం ప్రసంగించనున్నారు. ఆఫ్రికా ఖండంలో మృతుల సంఖ్య 313కి చేరింది. ఎక్కువ కేసులు దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. దిగుమతులు నిలిచిపోయి ఆఫ్రికాలో ఆహార కొరత తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా ప్రభావం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల మేర ప్రభావితమవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అంచనా వేసింది.

జాతీయ సంతాప దినం పాటించిన చైనా
కరోనా కారణంగా మృతి చెందిన ప్రజలు, వైద్య సిబ్బందికి చైనా భారీఎత్తున శ్రద్ధాంజలి ఘటించింది. శనివారం దేశమంతా జాతీయ సంతాప దినంగా పాటించింది. ఉదయం సరిగ్గా 10 గంటలు కాగానే వాహనాలన్నీ సైరన్లు మోగించాయి. జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ప్రధాని లీ కెఖియాంగ్‌ సహా ఉన్నతస్థాయి నేతలంతా తలలు దించి, మూడు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రజారోగ్య కారణాలతో జాతీయ సంతాపదినం పాటించడం చైనాలో ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. ఆంక్షలు సడలించడంతో కొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాపై తాము జరిపిన పోరాటంలో ఈ వైరస్‌ సోకి 95 మంది పోలీసులు, 46 మంది వైద్య సిబ్బంది అమరులయ్యారని చైనా అధికార యంత్రాంగం వెల్లడించింది.

Tags :

మరిన్ని