అమెరికా దుస్థితికి అదే కారణమా?
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికా దుస్థితికి అదే కారణమా?

చైనా నుంచి నేరుగా 4.30 లక్షల మంది అగ్రరాజ్యానికి

న్యూయార్క్‌: కొవిడ్‌-19 వైరస్‌ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ముఖ్యంగా న్యూయార్క్‌ రాష్ట్రంలో ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చొప్పున శనివారం ఒక్కరోజే మొత్తం 630 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షలకు పైగా కేసులు నమోదవ్వగా.. ఒక్క అమెరికాలోనే కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. అమెరికాలో ప్రయాణాలపై ఆంక్షలు విధించకముందు లక్షల మంది చైనా నుంచి అగ్రరాజ్యానికి వచ్చినట్లు సమాచారం. సుమారు 4.30 లక్షల మంది చైనా నుంచి నేరుగా అమెరికాలోకి ప్రవేశించగా.. అందులో వుహాన్‌ నుంచి వచ్చిన వారి సంఖ్య వేలల్లో ఉందని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ తన కథనంలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయాణాలపై ఆంక్షలు విధించడానికి ముందే సుమారు 1300 విమానాల్లో నేరుగా చైనా నుంచి అమెరికాలోని 17 నగరాలకు వచ్చినట్లు తెలిపింది.

నూతన సంవత్సరానికి ముందు కరోనా వైరస్‌ గురించి చైనా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులకు వెల్లడించినప్పటి నుంచి సుమారు 4.30 లక్షల మంది చైనా నుంచి నేరుగా అమెరికాకు వచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ట్రంప్‌ ప్రయాణ ఆంక్షలు విధించిన తర్వాత కూడా సుమారు 40 వేల మంది అమెరికాలోకి ప్రవేశించడం గమనార్హం. ముఖ్యంగా చైనా నుంచి ప్రయాణికుల తనిఖీల విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడమే ఇందుకు కారణమని కథనంలో పేర్కొంది. ముఖ్యంగా జనవరిలో మొదటి రెండు వారాల వరకు చైనా నుంచి వచ్చిన ఏ ఒక్కరినీ వైరస్‌కు సంబంధించిన స్క్రీనింగ్‌ చేయలేదు. అదే నెలలో పక్షం రోజుల తర్వాత మాత్రమే అమెరికాలో స్క్రీనింగ్‌ మొదలైంది. అదీ లాస్‌ ఏంజెలెస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌ విమానాశ్రయాల్లో మాత్రమే. అదీ కేవలం వుహాన్‌ నుంచి వచ్చిన వారినే తనిఖీ చేశారు. అప్పటికే  సుమారు 4 వేల మంది వుహాన్‌ నుంచి అమెరికాలోకి ప్రవేశించారని విమాన ప్రయాణాల డేటా అందించే వారీఫ్లైట్స్‌ డేటా వెల్లడించింది. జనవరి నాటికి వివిధ దేశాలకు చెందిన 4.30 లక్షల మంది చైనా నుంచి అమెరికా వ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాలకు చేరుకున్నారని పేర్కొంది. ఫిబ్రవరి 2 నుంచి ఆంక్షలు విధించినప్పటికీ అమెరికన్లు సహా పలువు దేశాల వారికి మినహాయింపు ఇవ్వడంతో గత వారం వరకు బీజింగ్‌ నుంచి ప్రముఖ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగడం గమనార్హం.

అయితే, తాము విధించిన ప్రయాణ ఆంక్షల వల్లే దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని పలుమార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించుకోవడం ప్రస్తావనార్హం. కానీ ప్రయాణ ఆంక్షలు సత్వరం చేపట్టకపోవడం, ఆ విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. వాషింగ్టన్‌లో జనవరి 20న తొలి కరోనా పాజిటివ్‌ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ కరోనా వైరస్‌ సోకిన తొలి వ్యక్తి అమెరికాలోకి ప్రవేశించారనే సమాచారం లేకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి..

అమెరికాలో ఆగని మృత్యుఘోష


మరిన్ని