అమెరికాలో వైద్యుల స్థితి దయనీయం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో వైద్యుల స్థితి దయనీయం

కుటుంబీకులనూ చూడలేని దుస్థితి
వారాల తరబడి తప్పని నిరీక్షణ
ఆస్పత్రులుగా భారీ భవంతులు
భారత్‌లో ముందు జాగ్రత్తలను పాటించాలి
ఈనాడు’తో సీనియర్‌ వైద్యురాలు లక్ష్మి మాడభూషి
ఈనాడు - హైదరాబాద్‌

‘‘అమెరికాలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కరోనాతో మరణించిన వారిని కడసారి చూసుకొనే పరిస్థితి కూడా లేదు. చాలామంది నర్సుల చేతుల్లోనే ప్రాణాలొదులుతున్నారు. వైద్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆసుపత్రుల నుంచి నేరుగా హోటళ్లకో.. గ్యారేజీలోకో, లేకుంటే ఇంట్లోనే ఒక గదిలోకి వెళ్లడం తప్ప ఇంట్లో వాళ్లను కూడా చూసే పరిసితి లేదు. నేను మా ఇంట్లో వాళ్లను చూసి నాలుగు వారాలైంది. ఆసుపత్రి నుంచి నేరుగా పై అంతస్తుకెళ్లడం, మళ్లీ ఆసుపత్రికి వెళ్లడం, ఒక్కోసారి ఇంటికి కూడా వారం తర్వాతనే.. అయినా వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా పనిచేస్తున్నారు. భారత్‌లో ప్రజలు తప్పకుండా ముందు జాగ్రత్తలను పాటించాలి. జనంలోకి వైరస్‌ ఇంకా ప్రబలితే ఏమీ చేయలేం. నాణ్యమైన మానవ వనరులు, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత సామర్థ్యం గల ఆసుపత్రులు ఉన్న అమెరికాలోనే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకొని కనీస దూరం, మాస్క్‌లు ధరించడం లాంటివి తప్పకుండా పాటించాలి.’’ అని పశ్చిమ మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ ఆసుపత్రి సీనియర్‌ వైద్యురాలు లక్ష్మి మాడభూషి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈమె రెండున్నర దశాబ్దాలుగా అమెరికాలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. అక్కడి పరిస్థితిని ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’కి వివరించారు. ఆమె మాటల్లోనే..

వైద్య విద్యార్థులూ సేవల్లోకి..
ఇక్కడ ఒక పరీక్షను వాయిదా వేయడం చాలా అరుదు. అలాంటిది వైద్యవిద్య చదివే నాలుగో సంవత్సరం విద్యార్థులను కూడా పనిలో పెడుతున్నారు. దీన్నిబట్టే వైద్యుల అవసరం ఎంత ఉందో అర్థమవుతోంది. గత శుక్రవారం నుంచే మసాచుసెట్స్‌లో 1,400 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 12 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, సుమారు 250 మంది మరణించారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఆరోవంతు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇందులో ఆరోవంతు వెంటిలేటర్‌ మీదకు వెళ్తే, వారిలో మూడో వంతు మృత్యువాత పడుతున్నారు. పెద్దలతో పాటు యువకులు, చిన్నపిల్లలనూ ఈ మహమ్మారి వదలడంలేదు. కనెక్టికట్‌ రాష్ట్రంలో ఆరువారాల శిశువుకు పాజిటివ్‌ వస్తే, న్యూయార్కులో మూడేళ్ల వయస్సున్న బిడ్డకు సోకింది. నిర్ధారణ పరీక్షలు ముగిసేకొద్దీ పాజిటివ్‌ వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. వీరు మొదటి ఏడు రోజులు ఎక్కువగా ఇబ్బంది పడటం లేదు. ఏడు నుంచి తొమ్మిది రోజుల మధ్యలో తీవ్రత పెరిగిన వారిని వెంటిలేటర్‌ మీదకు పంపాల్సి వస్తోంది. వీరిలో కీలక అవయవాలు పనిచేయడంలేదు. ఇక్కడ పడకలు సరిపోవడంలేదు. పెద్ద పెద్ద భవనాలను ఆస్పత్రులుగా మార్చారు. ఇక్కడ ఏప్రిల్‌ ఆఖరు వరకు ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు కనీసం దూరం పాటించాలనే నిబంధన మే నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఎన్‌-95 మాస్కులను 5సార్లు వాడిన తర్వాత స్టెరిలైజ్‌ చేసి మళ్లీ వినియోగిస్తున్నారు. చాలా ఇళ్లలో వైరస్‌ బారిన పడిన వృద్ధులను పిల్లలు అద్దంలోంచి చూడటం, తలుపు దగ్గరే అన్నం పెట్టి వెళ్లడం లాంటివి చేస్తున్నారు.

Tags :

మరిన్ని