అడుగు బయటపెట్టాలన్నా భయమే
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అడుగు బయటపెట్టాలన్నా భయమే

లాక్‌డౌన్‌ ఉన్నా లండన్‌లో యథేచ్ఛగా జనసంచారం
సరకులు కొనాలన్నా దొరకట్లేదు
తెలుగు విద్యార్థుల ఆందోళన

‘యూకేలో కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా ఉంది. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నా లండన్‌లో జనం యథేచ్ఛగా రోడ్లపై తిరిగేస్తున్నారు. దీంతో మేం బయటకు అడుగుపెట్టాలంటేనే భయపడాల్సి వస్తోంది’ అని అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘లాక్‌డౌన్‌ వల్ల యూకేలోని మాల్స్‌లో నిత్యావసర సరకులన్నీ అడుగంటిపోతున్నాయి. బియ్యం అసలే దొరకట్లేదు. సరకుల ధరలు రెట్టింపయ్యాయి’ అని ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వందల మంది విద్యార్థులు లండన్‌లో వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. వీరిలో పలువురు ‘ఈనాడు’తో మాట్లాడుతూ వారి గోడు వెళ్లబోసుకున్నారు.


నెలవారీ ఖర్చులు, అద్దెలు ఎలా?

తెలుగు విద్యార్థుల్లో అత్యధిక మంది లండన్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకుంటూ కోర్సులు చదువుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో పార్ట్‌టైమ్‌ పనులు లేకపోవడంతో ఆందోళన పడుతున్నారు. ‘నేను నా స్నేహితులతో కలిసి ఫ్లాటు అద్దెకు తీసుకున్నా. నా వాటాగా నెలకు మన కరెన్సీలో రూ.30 వేలు అద్దె చెల్లించాలి. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తే వారానికి రూ.16 వేల వరకూ వచ్చేవి. అవి అద్దెలకు, ఇతర ఖర్చులకూ సరిపోయేవి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. భవిష్యత్తు ఏమిటో అర్థం కావట్లేదు’ అని ప్రణయ్‌రాజ్‌ అనే విద్యార్థి వాపోయారు.


రుసుముల్లో మినహాయింపులివ్వాలి

‘కరోనా ప్రభావంతో విశ్వవిద్యాలయాలన్నీ ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు ఫీజులు చెల్లించాం. ఆన్‌లైన్‌లో తరగతుల కోసమే అయితే భారత్‌ నుంచి యూకే దాకా వచ్చి భారీ రుసుములు చెల్లించాల్సిన అవసరం ఏముంది? మేం కట్టిన రుసుములు తిరిగివ్వాలి. ఇకపై చెల్లించాల్సిన ఫీజుల్లోనూ మినహాయింపులు ఇవ్వాలి’’ అని గుంటూరు జిల్లా విద్యార్థి మార్క్‌ అన్నారు. డబ్బులన్నీ అయిపోయాయని. ఇంటి నుంచి తెప్పించుకుందామన్నా కుదరడం లేదని భానుప్రకాశ్‌ అనే యువకుడు వాపోయారు. మాస్కులు, శానిటైజర్లు కొందామన్నా దొరకట్లేదని పలువురు విద్యార్థులు ‘ఈనాడు’తో చెప్పారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా ఆసుపత్రులకు రావద్దంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

- ఈనాడు, అమరావతి
Tags :

మరిన్ని