ఔషధ దౌత్యం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఔషధ దౌత్యం

పొరుగు దేశాలకు కానుకగా భారత్‌ నుంచి ప్రాణాధార మందులు

దిల్లీ: కరోనా కొత్త వైరస్‌ (కొవిడ్‌-19) ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నవేళ ఔషధ దౌత్యానికి భారతదేశం శ్రీకారం చుట్టింది. మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధాన్ని ఎగుమతి చేయాలన్న విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించడమే కాకుండా తనంత తానుగా ప్రాణాధార మందుల్ని పొరుగు దేశాలకు ఉచితంగా పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. భూటాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, నేపాల్‌, మయన్మార్‌, సీషెల్స్‌, మారిషస్‌, ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు పారాసిటమాల్‌తో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల్ని పంపిస్తోంది. శ్రీలంకకు ఇలాంటి 10 టన్నుల ఔషధాలను తీసుకుని ఎయిరిండియా ప్రత్యేక విమానం రెండ్రోజుల క్రితం వెళ్లింది. అమెరికా, స్పెయిన్‌, బ్రెజిల్‌, జర్మనీ, బ్రిటన్‌తో ఇదివరకే మన ఔషధ సంస్థలు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలకు లోబడి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధ ఎగుమతులకు కేంద్రం పచ్చజెండా చూపిన విషయం తెలిసిందే. గల్ఫ్‌ దేశాలకు అవసరమైన ఔషధాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. అవసరమైతే రష్యాకూ మందుల సరఫరాకి సిద్ధమని మన దేశం ప్రకటించింది.

 

ధన్యవాదాలు మోదీ..
తాము అడిగిన రీతిలో మందుల ఎగుమతుల్ని అనుమతించినందుకు భారత ప్రధాని నరేంద్రమోదీకి, దేశ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో సాయమందించడాన్ని తామెన్నడూ మరువలేమన్నారు. భారత ప్రధాని ఓ మహత్తరమైన వ్యక్తి అని కొనియాడారు. అసాధారణ సందర్భాల్లో స్నేహితుల మధ్య సహకారం ఇలాగే మరింత బలపడాలన్నారు.దీనిపై మోదీ బదులిస్తూ... కరోనాపై పోరాటంలో కలిసి విజయం సాధిద్దామన్నారు. ‘ట్రంప్‌..! మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇలాంటి సమయాలే స్నేహితుల్ని మరింత దగ్గర చేస్తాయి. మన రెండు దేశాల భాగస్వామ్యం ఎన్నడూ లేనంత బలపడింది. మానవాళికి సాధ్యమైనన్ని విధాలా సాయపడడానికి భారతదేశం సిద్ధంగా ఉంది’ అని చెప్పారు. ఔషధ దౌత్యంపై భారతీయ అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉత్పత్తి చేసే ముడి పదార్థాలను బ్రెజిల్‌కు పంపించడానికి భారత్‌ అంగీకరించడం పట్ల మోదీకి బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో కృతజ్ఞతలు తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంపై మోదీ గురువారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో మాట్లాడారు. ఉభయ దేశాల నిపుణులు తమ అనుభవాలను పరస్పరం పంచుకునేలా చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు.

Tags :

మరిన్ని