కొవిడ్‌పై పోరుకు ప్రవాసుల భారీ సాయం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కొవిడ్‌పై పోరుకు ప్రవాసుల భారీ సాయం

వాషింగ్టన్‌: మానవాళికి సవాల్‌ విసురుతున్న కొవిడ్‌-19పై పోరుకు ప్రవాస భారతీయులు నడుం బిగించారు. అమెరికాలో ఉన్నత స్థానంలో ఉన్న కొంతమంది ప్రవాసులు ఆరు లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. భారత్‌, అమెరికాలో మహమ్మారి విజృంభణ వల్ల ప్రభావితమైన ప్రజలకు సాయం అందించేందుకు వీటిని వినియోగించనున్నట్లు తెలిపారు. ‘చలోగివ్‌ ఫర్‌ కొవిడ్‌-19’ పేరిట ప్రారంభించిన ఈ నిధుల సేకరణకు ఉన్నత స్థాయి, నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. వీరంతా కలిసి ఐదు లక్షల డాలర్లు ఆర్థిక వనరుల్ని సమకూర్చారు. మరో లక్ష డాలర్లను అందించడానికి ఇతర ప్రవాస భారతీయులు ముందుకు వచ్చారు. వీటిని అమెరికాలో ‘ఫీడింగ్‌ అమెరికా’, భారత్‌లో ‘గూంజ్‌’ స్వచ్ఛంద సంస్థల ద్వారా అవసరమైన వారికి చేరుస్తామని తెలిపారు. 

ఈ సందర్భంగా పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి మాట్లాడుతూ.. ఇప్పటికే ఉన్న ఆహార సంక్షోభాన్ని కరోనా వైరస్‌ వెలుగులోకి తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో మానవాళి సంక్షేమానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మన ప్రజల జీవితాలపై పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో భారీ ప్రయోజనాల్ని చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అత్యధిక విరాళం అందించిన ఆనంద్‌ రాజారామన్‌ స్పందిస్తూ.. కొవిడ్‌-19తో ప్రపంచం ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. రాజారామన్‌ సిలికాన్‌ వ్యాలీలో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా ఉన్నారు. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యలు ప్రజల జీవితాల్ని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేశాయన్నారు. ఇది ప్రవాసులంతా ఏకమై సాయమందించేందుకు సరైన అవకాశం అని అభిప్రాయపడ్డారు.

 

ఇవీ చదవండి...

ఆ మహిళకు వైరస్ ఎలా సోకింది?

ఒకే గది.. 73 రోజుల ఒంటరితనం


మరిన్ని