సామూహిక ఖననాలు!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సామూహిక ఖననాలు!

కరోనా దెబ్బకు న్యూయార్క్‌లో దయనీయ పరిస్థితులు
ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన మరణాలు
అమెరికాలో మొత్తం 18 వేలకు పైగా మరణాలు
స్పెయిన్‌, ఫ్రాన్స్‌లో కాస్త తగ్గిన వైరస్‌ తీవ్రత
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇళ్లలోనే ఈస్టర్‌ వేడుకలు

రోమ్‌, న్యూయార్క్‌: మానవాళి మనుగడకు పెను సవాలు విసురుతూ కరోనా రక్కసి మరింతగా బుసలు కొడుతోంది. ప్రపంచమంతటా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారంతో లక్ష దాటింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కొవిడ్‌-19 దెబ్బకు వణికిపోతోంది. న్యూయార్క్‌ నగరంలో అధికారులు సామూహిక ఖననాలు జరిపించాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకుగాను దేశ విదేశాల్లో విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం ఆదివారం ఈస్టర్‌ వేడుకలపై కనిపించనుంది. కోట్ల మంది ఇళ్లలోనే పండుగను జరుపుకోనున్నారు. శుక్రవారం ‘గుడ్‌ ఫ్రైడే’ అయినప్పటికీ చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. కొవిడ్‌ తీవ్రతకు అమెరికాలో బుధవారం 1,973 మంది కరోనా తీవ్రతకు ప్రాణాలు కోల్పోగా, గురువారం 1,783 మంది మృత్యువాతపడ్డారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:00 గంటల వరకు మరో 1,309 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 18 వేలు దాటింది. కేసుల సంఖ్య 4.8 లక్షలు దాటింది. న్యూయార్క్‌ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 777 మంది మరణించారు. న్యూయార్క్‌లో మృతుల సంఖ్య 7,800 దాటింది. అమెరికా కాకుండా ప్రపంచంలో మరే దేశంతో పోల్చిచూసినా న్యూయార్క్‌ రాష్ట్రంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉంèటం గమనార్హం. న్యూయార్క్‌ నగరంలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మృతదేహాలను తీసుకెళ్లేందుకూ ఎవరూ ముందుకు రావట్లేదు.

వాటిని భద్రపరిచేందుకు తగినన్ని సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు సామూహిక ఖననాలు నిర్వహిస్తున్నారు. స్థానిక హార్ట్‌ దీవిలో ఓ భారీ గుంతను తవ్వి.. నిచ్చెన సహాయంతో అందులోకి దిగి పదుల సంఖ్యలో మృతదేహాలను గురువారం ఖననం చేసిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మృతులందరూ కరోనా బారిన పడినవారే కావొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

150 ఏళ్లుగా.. ఆ దీవిలో...
ఎవరూ గుర్తించని, తీసుకెళ్లని మృతదేహాలను ఖననం చేసేందుకు న్యూయార్క్‌ అధికారులు దాదాపు 150 ఏళ్లుగా హార్ట్‌ దీవిని ఉపయోగించుకుంటున్నారు. అలా ఇప్పటివరకు అక్కడ 10 లక్షలమందికిపైగా అంత్యక్రియలను నిర్వహించారు. సాధారణంగా ఈ దీవిలో గతంలో సగటున వారానికి 25 మృతదేహాలను ఖననం చేసేవాళ్లమని.. కరోనా విజృంభణతో ఆ సగటు ఇప్పుడు రోజుకు 25గా నమోదవుతోందని అధికారులు తెలిపారు. ఇంకా మృతదేహాలు వచ్చే అవకాశముండటంతో మరిన్ని భారీ గుంతలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 1.6 లక్షల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. వారిలో 7 వేలమందికిపైగా మృత్యువాతపడ్డారు. గత కొన్ని రోజులతో పోలిస్తే రాష్ట్రంలో తాజాగా కేసుల సంఖ్య తగ్గడం మాత్రం ఆశాజనకంగా కనిపిస్తోంది. గురువారం కేవలం 200 మంది కరోనా బాధితులే ఆస్పత్రులకు వచ్చారు. రాష్ట్రంలో తాము తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలు ఫలిస్తున్నాయని గవర్నర్‌ ఆండ్రూ క్యూమో పేర్కొన్నారు.

ఆహారం అందక విద్యార్థుల వెతలు
కరోనా విజృంభణ నేపథ్యంలో పాఠశాలలు మూతపడటంతో అమెరికాలో పేద విద్యార్థులు ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా పాఠశాలల పనిదినాల్లో దేశవ్యాప్తంగా ప్రతిరోజు 2.2 కోట్ల మంది విద్యార్థులకు ఉచిత/రాయితీతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందుతుంది. కరోనా దెబ్బకు సెలవులు ప్రకటించాక కూడా చాలా పాఠశాలలు కొన్నాళ్లపాటు విద్యార్థులకు ఆహారాన్ని పంపిణీ చేశాయి. వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో ప్రస్తుతం సిబ్బంది విధులకు రావట్లేదు. దీంతో చాలాచోట్ల పంపిణీ నిలిచిపోయింది.

త్వరగానే పుంజుకుంటాం: ట్రంప్‌
కరోనా దెబ్బకు అమెరికాలో నిరుద్యోగిత రేటు ఈ నెలలో 15 శాతానికి పెరిగే ముప్పుందని అంచనాలు వెలువడుతున్నాయి. 1930ల నాటి మహా మాంద్యం తర్వాత ఆ దేశంలో నిరుద్యోగిత రేటు అంతగా ఎప్పుడూ పెరగలేదు. అయితే, కరోనా సంక్షోభం ముగిశాక తమ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊపిరులూదేందుకు 2.3 లక్షల కోట్ల డాలర్ల రుణాలు ఇవ్వనున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వు తాజాగా ప్రకటించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికాలోని అలబామా, ఇండియానా సహా మొత్తం 16 రాష్ట్రాల్లో పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం చివరి వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఐరోపా దేశాల్లో ఆశాజనక పరిస్థితులు
ఐరోపా దేశాల్లో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. స్పెయిన్‌లో తాజా మరణాలు గత 17 రోజులతో పోలిస్తే తక్కువగా నమోదయ్యాయి. దీనిపై ఆ దేశ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌ స్పందిస్తూ.. ‘‘మహమ్మారి ప్రారంభించిన దావానలం క్రమంగా నియంత్రణలోకి వస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లో ఐసీయూల్లో రోగుల సంఖ్య తగ్గింది. కరోనా విజృంభణ మొదలయ్యాక ఆ సంఖ్య తగ్గడం ఇదే తొలిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటలీ మాత్రం వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో ఉంది. మరోవైపు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలోనూ ఈ వారం కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. దక్షిణ కొరియాలో తాజాగా కేవలం 27 కేసులే నమోదయ్యాయి. అక్కడ కొత్త కేసుల సంఖ్య 100కు తక్కువగా నమోదు కావడం ఇది వరుసగా ఏడో రోజు.


మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే బోరిస్‌

కొవిడ్‌-19 బారిన పడ్డ బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ క్రమంగా కోలుకుంటున్నారు. మూడు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన్ను తాజాగా సాధారణ వార్డుకు మార్చారు. మరికొన్ని రోజులపాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండనున్నారు. బ్రిటన్‌లో గురువారం ఒక్కరోజే 881 మంది మరణించారు. యెమెన్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. జర్మనీలో తాజాగా 266 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలో ఒక్క రోజులో చోటుచేసుకున్న గరిష్ఠ మరణాలు ఇవే.

Tags :

మరిన్ని