బాధితుల్లో పొగతాగే వారే అధికం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బాధితుల్లో పొగతాగే వారే అధికం

కరోనా సోకిన వారిలో 68 శాతం మంది పురుషులే
నర్సుల సేవలు వెలకట్టలేనివి
లాక్‌డౌన్‌తో భారత్‌లో వైరస్‌ కట్టడి
‘ఈనాడు’తో న్యూయార్క్‌ నుంచి డాక్టర్‌ మధు కొర్రపాటి
ఈనాడు - హైదరాబాద్‌

‘కనిపించని ఈ మహమ్మారిని చంపి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? అన్న ప్రశ్నకు.. సమాధానం దొరకని పరిస్థితి. న్యూయార్క్‌లో కేసులు అంచనాకు అందటం లేదు. సోమవారం కేసుల నమోదు పెద్దగా లేకపోవటంతో ఊపిరి పీల్చుకోవచ్చు అనుకున్నాం. మంగళవారం నుంచి మునుపటి కన్నా ఎక్కువ సంఖ్యలో కేసులు వస్తున్నాయి’ అని న్యూయార్క్‌లోని ప్రవాస భారతీయ ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధు కొర్రపాటి చెప్పారు. చరవాణి ద్వారా ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ ‘ఇప్పుడిప్పుడే వైరస్‌ తీవ్రత తగ్గే సూచనలు కనిపించటం లేదు. తొలుత కొంచెం ఇబ్బందిగా ఉన్నా వెంటిలేటర్‌ ఉపయోగించేవాళ్లం. ఇలా పెట్టిన వారిలో 90 శాతం మంది బతకటం లేదు. తాజాగా ఇక ఆశలు వదులుకున్నట్లే అనుకున్న వారినే వెంటిలేటర్‌పై ఉంచుతున్నాం. ఈలోగా వారికి వివిధ స్థాయుల్లో ఆక్సిజన్‌ అందిస్తున్నాం. నమోదు అవుతున్న కేసుల్లో 68 శాతం పురుషులు, 32 శాతం మంది మహిళలున్నారు. మృతుల్లో అత్యధికులు పురుషులే. వైరస్‌ బారిన పడుతున్న వారిలో పొగతాగే అలవాటున్న వారే ఎక్కువ.


నర్సులకు పాదాభివందనం

ఆస్పత్రుల్లో నర్సులు చేస్తున్న సేవలకు పాదాభివందనం చేయాలి. వైరస్‌ బారిన పడిన వారిలో చాలా మందికి మూత్రపిండాల సమస్య వస్తుంది. వీరికి డయాలసిస్‌ చేయాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది. ఈ సమయంలో నర్సులు బాధితుడి వద్దే ఉండాలి. ఇలా ఎంతో మందికి వారు సేవలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యుల కన్నా నర్సులే వైరస్‌ ఉన్న వ్యక్తులకు ఎక్కువ సేవలు చేయాల్సి వస్తుంది. వారు చేస్తున్న సేవలను వర్ణించలేం. వారు నాకు ప్రత్యక్ష దైవాలుగా కనిపిస్తున్నారు. ఈ మహమ్మారి నుంచి బయటపడిన తరవాత నర్సులకు పాదాభివందనం చేస్తాను. నా వైద్య వృత్తి జీవితం ఎప్పుడూ ఇంత బిజీగా లేను. మహమ్మారి కారణంగా 96 శాతం మంది వైద్య సిబ్బంది, ఆరోగ్య సేవా కార్యకర్తల్లో ఆందోళన ఉన్నప్పటికీ మానవసేవే మాధవ సేవ అన్న దృక్పథంతో పని చేస్తున్నారు. వైద్య సిబ్బందిని ప్రోత్సహించాల్సిన సమయమిది.


వ్యాయామం... ప్రాణాయామం

రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాయామం తప్పనిసరి. ప్రాణాయామమూ చేయాలి. శ్వాసకు సంబంధించిన నాడులు చైతన్యవంతం చేసేందుకు వైద్యులు చేసిన సూచనలు తప్పక ఆచరించాలి. ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలను తినవద్దు. అధిక చక్కెర ఉండే స్నాక్స్‌, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. నోటికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు లేకుండా బయటకు వెళ్లటం మంచిదికాదు. సామాజిక దూరం అనివార్యం. భారతదేశంలో నిబంధనలను ప్రభుత్వంపై భయంతోనూ, ప్రాణభీతితోనో అధిక శాతం మంది పాటిస్తున్నారు. అదే శ్రీరామరక్ష. న్యూయార్క్‌తోపాటు అమెరికాలోని కొన్ని నగరాల్లో పరిస్థితి చూస్తుంటే వీళ్లకు ప్రాణాలపై ప్రేమ లేదా? అని ఆవేదన కలుగుతోంది. భారతదేశంలో ఎంత మందికి వైద్య పరీక్షలు చేస్తున్నారన్న అంశాన్ని పక్కన పెడితే లాక్‌డౌన్‌తో వైరస్‌ ఉద్ధృతికి కొంత మేరకైనా ప్రభుత్వాలు ముకుతాడు వేశాయి’ అని చెప్పవచ్చు.

Tags :

మరిన్ని