‘అమెరికా’ విద్యార్థులకు ఊరట!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
‘అమెరికా’ విద్యార్థులకు ఊరట!

ఆన్‌లైన్‌ తరగతులకు సగం ఫీజు తగ్గే అవకాశం
ఇప్పటికే సగం వాపసిస్తున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు
సంకేతాలు ఇచ్చిన పలు ప్రైవేట్‌ వర్సిటీలు
తుది నిర్ణయం కోసం ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్న అమెరికా విశ్వవిద్యాలయాలు కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ట్యూషన్‌ రుసుములను తగ్గించే దిశగా యోచిస్తున్నాయి. విద్యార్థులకు ఎలా సహాయం చేయాలా అనే అంశంపై చర్చిస్తున్నామని కొన్ని వర్సిటీలు ఇప్పటికే వెల్లడించగా.. మరికొన్ని చెల్లించిన ఫీజులో సగాన్ని తిరిగి విద్యార్థుల ఖాతాల్లో జమచేస్తున్నాయి. మొత్తానికి సెమిస్టర్‌ రుసుములో 25-50 శాతం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అమెరికాలో దాదాపు 4,800 ఉన్నత విద్యాసంస్థలున్నాయి. సాధారణంగా చాలా వాటిల్లో సెమిస్టర్‌ రెగ్యులర్‌ కోర్సుకు ట్యూషన్‌ రుసుము 5వేల నుంచి 9వేల డాలర్లు ఉంటుంది. సెమిస్టర్‌లో ఎక్కువ సబ్జెక్టులు ఎంచుకుంటే మరికొంత అధికంగా చెల్లించాలి. వర్సిటీలకు వెళ్లి చదువుకునే(రెగ్యులర్‌) కోర్సులతో పోల్చుకుంటే ఆన్‌లైన్‌ కోర్సులకు అందులో సగమే రుసుము వసూలు చేస్తారు. అక్కడ జనవరి నుంచి కొత్త సెమిస్టర్‌ ప్రారంభం కాగా మార్చి 15-20 తేదీల నుంచి ఆన్‌లైన్‌ తరగతులు మొదలై ఈ నెలాఖరుకు ముగుస్తాయి. మేలో పరీక్షలు నిర్వహిస్తారు.

ప్రతికూలత కారణంగా...
దాదాపు రెండు నెలలపాటు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండటం, విశ్వవిద్యాలయం ప్రాంగణాల్లో కరికులమ్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(సీపీటీ) కింద తాత్కాలిక ఉద్యోగం చేసే అవకాశం కూడా కోల్పోయిన నేపథ్యంలో రుసుముల తగ్గింపుపై విద్యాసంస్థలు చర్చిస్తున్నాయి. కనెక్టికట్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చదువుతున్న తెలంగాణ విద్యార్థి సాయి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నందున విద్యార్థులకు రుసుముల తగ్గింపుపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వర్సిటీ అధికారులు హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ(పబ్లిక్‌), నాన్‌ ప్రాఫిట్‌ వర్సిటీలు ఇప్పటికే తిరిగి చెల్లిస్తుండగా ప్రైవేట్‌, ఫర్‌ ప్రాఫిట్‌ విశ్వవిద్యాలయాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అవి ఫీజు తిరిగివ్వకపోయినా తర్వాతి సెమిస్టర్‌కు సర్దుబాటు చేయవచ్చని భావిస్తున్నారు.

సగం రుసుము వెనక్కి..
అట్లాంటాలోని జార్జియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ రెండో సెమిస్టర్‌ చదువుతున్న విద్య  మాట్లాడుతూ.. తాను సెమిస్టర్‌కు 3వేల డాలర్లు ఫీజుగా చెల్లించానని, ఇటీవల అందులో సగం తిరిగి ఇచ్చారని తెలిపారు. అదే వర్సిటీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ చదువుతున్న తన తమ్ముడికీ సగం రుసుము వెనక్కి వచ్చిందని చెప్పారు. మొత్తానికి ఇది భారతీయ విద్యార్థులకు కొంత ఊరట కలిగించనుంది. ఏటా భారత్‌ నుంచి 2లక్షల మందికిపైగా విద్యార్థులు అమెరికాకు వెళ్తుండగా.. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి 40వేల నుంచి 50వేల వరకు ఉండొచ్చని అంచనా.

రుసుములు తగ్గిస్తున్నారు
కరోనాతో చదువుకు ఆటంకం రాకూడదని ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నారు. దీనివల్ల వర్సిటీలు రుసుములను తగ్గిస్తున్నాయి. 2,600 వరకు ఉన్న పబ్లిక్‌, నాన్‌ ప్రాఫిట్‌ విశ్వవిద్యాలయాలు 50 శాతం రుసుములను వెనక్కి ఇస్తున్నాయి. క్యాంపస్‌ సౌకర్యాల నిమిత్తం చెల్లించిన ఇతర ఫీజులనూ అవి విద్యార్థులకు తిరిగి చెల్లిస్తాయి. వర్సిటీలు టీచింగ్‌ అసిస్టెంట్‌షిప్‌లు, ఇతర ఫెలోషిప్‌లను ఆపలేదు. దీనివల్ల మన విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందే పడే పరిస్థితి ఉండదు. విద్యార్థులు ఏ అవసరమొచ్చినా నా యూఎస్‌ నెంబరు +16786407682లో సంప్రదించవచ్చు.

- డా।। అన్నవరపు కుమార్‌, విద్యావేత్త
Tags :

మరిన్ని