అగ్రరాజ్యాల్లో ఉగ్రరూపం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అగ్రరాజ్యాల్లో ఉగ్రరూపం

అమెరికాలో 24 గంటల్లో 2 వేలకు పైగా మరణాలు
బ్రిటన్‌లోనూ ఒక్క రోజులో 917 మంది బలి
సింగపూర్‌లో కొత్తగా 51 మంది భారతీయులకు సోకిన వైరస్‌

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా ధాటికి అత్యంత శక్తిమంతమైన దేశాలూ విలవిల్లాడుతున్నాయి. కనిపించని శత్రువుపై చేస్తున్న పోరాటంలో నిత్య మృత్యు ఘోష తప్పడం లేదు. మరణాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అమెరికాలో శుక్ర, శనివారాల మధ్య... కేవలం 24 గంటల వ్యవధిలోనే 2,108 మంది చనిపోయినట్లు జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది.  ఆ ప్రకారం- ఇక్కడ మొత్తం మరణాలు 19 వేల మార్కును దాటాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధికంగా ఇటలీలో 19,468 కరోనా మరణాలు చోటుచేసుకోగా... అమెరికా దీన్ని అధిగమించింది. అగ్రరాజ్యంలో కొవిడ్‌-19 సోకిన వారి సంఖ్య 5లక్షలకు మించిపోయింది. బ్రిటన్‌లో శనివారం ఒక్కరోజే 917 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో ఇక్కడ మొత్తం మరణాలు 10 వేల మార్కుకు చేరువయ్యాయి. బ్రిటన్‌ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కొరత తీవ్రంగా ఉందని, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నారని బ్రిటిష్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కౌన్సిల్‌ ఛైర్‌, భారత సంతతి వైద్యుడు డా.చంద్‌ నాగ్‌పాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  బెల్జియం, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌లోనూ వందల మందిని మహమ్మారి బలితీసుకుంది. శుక్రవారం రాత్రికి బ్రెజిల్‌లో కరోనా మృతుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. ఇక్కడ జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరింత మంది మృతిచెందే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశాధ్యక్షుడు బోల్సొనారో కరోనాను తక్కువగా అంచనా వేశారని, సాధారణ ఫ్లూ వంటిదేనని పేర్కొన్నారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సింగపూర్‌లో శనివారం 191 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో 51 మంది భారతీయులే ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

నర్సింగ్‌ హోమ్స్‌లో శవాలకు గదులు!
న్యూయార్క్‌లోని వివిధ నర్సింగ్‌ హోమ్స్‌లో కాలం వెళ్లదీస్తున్న సుమారు 2 వేల మంది వృద్ధులు, రోగులు కరోనా ధాటికి మృత్యువాతపడ్డారు. ‘‘మా నర్సింగ్‌ హోమ్‌లో ఉండే 15 మంది ఇటీవల చనిపోయారు. వారి మృతదేహాలను భద్రపరిచేందుకు బయట ఎక్కడా శవాగారాల్లో చోటులేదు. దీంతో వాటి కోసం మా దగ్గరే ఒక గదిని కేటాయించాం’’ అని బ్రూక్లిన్‌లోని క్రౌన్‌ హైట్స్‌ సెంటర్‌ ఫర్‌ నర్సింగ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ నిర్వాహకులు తెలిపారు.


భారతీయ అమెరికన్లలో విషాద ఛాయలు

 

కనీసం 40 మంది మృతి
1500 మందికి కరోనా పాజిటివ్‌

అమెరికాలో ఉంటున్న భారతీయులు, భారతి సంతతికి చెందిన సుమారు 40 మంది కరోనాతో మృతిచెందగా, మరో 1,500 మందికి కొవిడ్‌-19 సోకింది. మృతుల్లో కేరళకు చెందిన 17 మందితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఇద్దరు, ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు భారతీయ సమాజ పెద్దలు వెల్లడించారు. మృతుల్లో 21 ఏళ్ల వయసు యువకుడు మినహా మిగతా వారంతా 60 ఏళ్లు పైబడినవారేనని వారు తెలిపారు.  మృతుల్లో సునోవా అనలిటికల్‌ ఇన్‌కార్పొరేషన్‌ సీఈవో హనుమంతరావు మారెపల్లి, ఇండియన్‌ స్క్వేర్‌కు చెందిన ప్రముఖుడు అమిన్‌ చంద్రకాంత్‌(75), న్యూజెర్సీకి చెందిన మహేంద్రపటేల్‌ తదితరులు ఉన్నట్టు వివరించారు. న్యూజెర్సీలో సుమారు 400 మంది, న్యూయార్క్‌లో మరో వెయ్యిమందికి పాజిటివ్‌ వచ్చిందని, వీరిలో ఎక్కువమంది ట్యాక్సీ డ్రైవర్లేనని చెప్పారు.

Tags :

మరిన్ని