అమెరికాలో నిర్బంధ లాక్‌డౌన్‌ అంత సులువు కాదు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో నిర్బంధ లాక్‌డౌన్‌ అంత సులువు కాదు

అమెరికాలోని తెలుగు ఇంజినీర్‌ పమ్మి సతీష్‌చంద్ర

ఈనాడు డిజిటల్‌, అమరావతి: నిర్బంధంగా లాక్‌డౌన్‌ విధించడమంటే అమెరికా చట్టాల ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడమేనని, అది అంత సులువు కాదని అమెరికా, న్యూజెర్సీ రాష్ట్రంలోని బయోనె నగరంలో నివాసం ఉండే తెలుగు ఇంజినీర్‌ డా. పమ్మి సతీష్‌చంద్ర తెలిపారు.  ‘ఈనాడు’తో ఫోన్‌లో మాట్లాడిన సతీష్‌ అక్కడి పరిస్థితిని వివరించారు. బృందాలుగా పార్టీలు చేసుకోవడం, ఆరు అడుగుల సామాజిక దూరం పాటించకపోవడం వంటివి చేస్తే నేరాలుగా పరిగణిస్తారన్నారు. ‘‘ఇంటి నుంచే పనిచేస్తున్నా. పరిస్థితి తీవ్రతను గ్రహించి ముందే నెలకు సరిపడా నిత్యావసరాలు కొని ఇంట్లో ఉంచుకున్నా. ఏవైనా కావాలంటే ఈ కామర్స్‌ సంస్థలు తెచ్చి అపార్ట్‌మెంట్‌ కింద అంతస్తులో పెట్టి వెళ్లిపోతారు. రెండు రోజుల పాటు ఉంచేస్తా. వాటిపై శానిటైజర్లు చల్లి తీసుకెళ్తా.  మాల్స్‌లోకి వెళ్తే మాస్కులు, గ్లౌజులు వేసుకుని రావాలని సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త కోసం నేనే బయటకు వెళ్లడం మానేశా. నిర్బంధం విధించడం కంటే.. వైద్య సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఆర్థిక వ్యవస్థ రక్షణకే ప్రాధాన్యమిస్తున్నారు. అమెరికాది ఇరవై ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. దానిపై ఎలాంటి ప్రభావమూ ఉండకూడదనే ఉద్దేశంతోనే సహాయక చర్యల కోసం రెండు ట్రిలియన్‌ డాలర్లు కేటాయించారు. ఇబ్బందులు తొలగి తిరిగి యథావిధిగా పనులు నడిచేటప్పటికీ... పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగులకు, సంస్థల లాభాలకు , స్థూల ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదనేదే ప్రభుత్వ ఆలోచన. కరోనా ఉద్ధృతి పెరిగి కార్యకలాపాలు నిలుపుదల చేసిన కొత్తలో ప్రతి పౌరుడికీ 1200 డాలర్లు ఇచ్చారు. తరువాత నుంచి పే రోల్‌ ప్రొటెక్షన్‌ యాక్టును సమర్థంగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఉద్యోగుల జీతభత్యాలన్నీ సంస్థలకు ప్రభుత్వమే రుణంగా ఇచ్చేస్తోంది. ఉద్యోగాలు మాత్రం తీయొద్దని చెబుతోంది. ఒక్క ఉద్యోగమూ తీయకుండా ఉంటే ఆయా సంస్థలకు ఇచ్చిన రుణాలన్నీ మాఫీ చేస్తామంటోంది. ఇన్ని పాటించినా 10 మిలియన్‌ ఉద్యోగాలు పోయాయి...’’ అని సతీష్‌ చెప్పారు.

Tags :

మరిన్ని