విదేశీయుల వీసా గడువు పొడిగించిన కేంద్రం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
విదేశీయుల వీసా గడువు పొడిగించిన కేంద్రం

దిల్లీ: లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో ఉండిపోయిన విదేశీయుల వీసా గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం హోంశాఖ ఒక ప్రకటన చేసింది. ఈ-వీసాతో పాటు అన్ని రకాల వీసాల గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇందు కోసం విదేశీయులంతా వీసా గడువు పెంపును కోరుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. దీంతో విమానాల రాకపోకలు ఆగిపోయాయి. కేవలం వస్తువులను తరలించే కార్గో విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో చాలా మంది విదేశీయులు భారత్‌లో ఉండిపోయారు. అలాంటి వారి వీసా గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. తాజాగా ఆ గడువును ఏప్రిల్ 30 వరకు పెంచుతూ కీలక ప్రకటన చేసింది. 

ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గడువు మంగళవారంతో ముగియనుండటంతో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగిస్తూ కేంద్రం ఈ ప్రకటన చేసింది. అయితే వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అలానే ప్రధాని మోదీ మంగళవారం ఉదయం జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండంటంతో వీసాల గడువు పెంపు ప్రకటన లాక్‌డౌన్‌ పొడిగింపునకే కేంద్రం మొగ్గచూపుతుందనే విషయాన్ని సూచనప్రాయంగా తెలియజేస్తుంది.  


మరిన్ని