మా కృషి ఫలిస్తోంది: ట్రంప్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మా కృషి ఫలిస్తోంది: ట్రంప్‌

 

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. రోజువారీ కొత్త కేసుల నమోదు ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌, న్యూజెర్సీ, మిషిగాన్‌, లూసియానాలో వైరస్‌ బారినపడి ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు పాటిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. శ్వేతసౌధంలో సోమవారం రోజువారీ విలేకరుల సమావేశంలో భాగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు శ్వేతసౌధంలోని కీలక వైద్యుడు, కరోనా టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ భిన్నంగా స్పందించారు. గత వారం అత్యంత దారుణంగా గడించిందని.. ఇంకా చాలా మరణాలే సంభవిస్తాయని అంచనా వేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్యలో నిలకడ ఏర్పడిందన్నారు.

24 గంటల్లో 1,509 మరణాలు...

గత 24 గంటల్లో అమెరికాలో 1,509 మరణాలు సంభవించాయి. దీంతో అక్కడ మృతుల సంఖ్య 23,529కి పెరిగింది. ఇక వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య తాజాగా 5,87,583కు చేరింది. ఇక అమెరికాలో వైరస్‌కు కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌లో మరణాల సంఖ్య 10,107కు చేరింది. ఒక్క సోమవారం రోజే 722 మంది మృత్యువాతపడడం గమనార్హం. ఇక వైరస్‌ సోకిన వారి సంఖ్య 1,61,465కు చేరింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్రూ క్యుమో మాట్లాడుతూ.. గడ్డు పరిస్థితులు ముగిశాయని అభిప్రాయపడ్డారు. నగరంలో సాధారణ కార్యకలాపాల్ని పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

షట్‌డౌన్‌ ఎత్తివేసే పూర్తి అధికారం నాదే.. 

ఇక కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రాల్లో విధించిన షట్‌డౌన్‌ను ఎత్తివేసే అధికారం అధ్యక్షుడిగా తన చేతుల్లోనే ఉంటుందని ట్రంప్‌ అన్నారు. దేశంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పన తుది దశకు చేరిందన్నారు. ఈ మేరకు నిపుణులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాల గవర్నర్లకు త్వరలో అందజేస్తామన్నారు. అయితే దీనిపై కొంతమంది గవర్నర్లు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలను తెరిచేందుకు వారు సిద్ధమయ్యారు.

ఇవీ చదవండి..

ఫౌచికి ఉద్వాసన!

ఆ దేశాలపై యూఏఈ గుస్సా


మరిన్ని