మహమ్మారి నుంచి రక్షణ ఎలా?
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మహమ్మారి నుంచి రక్షణ ఎలా?

భారత సంతతి ఆందోళన

భారతీయులు విద్యాఉపాధుల కోసం వెళ్లిన దేశాల్లో నేడు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ తరంవారికన్నా ఎన్నో ఏళ్ల ముందే విదేశాలకు వెళ్లి స్థిరపడిన భారత సంతతివారు కూడా కొవిడ్‌ విషపు నీడలో కలవరపడుతున్నారు. ఈ రెండు వర్గాలూ కలిసి ప్రపంచమంతటా మూడు కోట్ల వరకు ఉంటారు. కరోనా వైరస్‌ను శీఘ్రంగా కట్టడి చేసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ కొత్త ఊపు తీసుకురాకపోతే వీరంతా మాతృదేశం ఆసరా కోసం ఎదురుచూస్తారు. ఇప్పటికే 130 కోట్ల పైచిలుకు జనాభాతో సతమతమవుతున్న భారతదేశానికి ఇది కొత్త సవాలు కానుంది. స్వదేశంలో సరైన అవకాశాలు లేక భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పాశ్చాత్య దేశాలకు బారులు తీరడాన్ని మేధావలసగా వర్ణించేవాళ్లం. సమాచార సాంకేతికత (ఐటీ) విస్పోటం తరవాత లక్షలాది భారతీయ నిపుణులను అమెరికా ఆకర్షించింది. మరోవైపు అనేకమంది కూలీలు పెద్ద సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రెండు వర్గాలవారు పెద్దయెత్తున స్వదేశానికి పంపే విదేశమారక ద్రవ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారత సంతతి మొత్తం ఆస్తులు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని మించిపోయాయని అంచనా.

ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
అమెరికాకు లేదా గల్ఫ్‌ దేశాలకు భారతీయుల వలసలు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం కాకుండా స్వచ్ఛందంగా జరిగాయి. వీరిలో అత్యధికులు ఆయాదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల వద్ద తమ పేర్లు, చిరునామాలను అధికారికంగా నమోదు చేసుకోలేదు. విదేశాల్లో భారతీయుల నైపుణ్యం, కష్టించి పనిచేసే తత్వం అక్కడి ప్రభుత్వాల మన్ననలు అందుకున్నాయి. వారు స్వదేశానికి పంపే లక్షల కోట్ల రూపాయలు వారి కుటుంబాలకే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ లాభించాయి. ప్రవాసుల కుటుంబాలు ఇళ్లు, పొలాలు, బంగారం కొనుక్కుంటే, ప్రభుత్వాలకు వాటిమీద పన్నుల ఆదాయం పెరిగింది. ఈ ఉభయ తారక లావాదేవీలవల్ల సర్కారుకు ప్రవాసుల బాగోగుల పట్ల ఆసక్తి పెరిగింది. విదేశాల్లోని భారత రాయబార, దౌత్య కార్యాలయాల్లో ప్రవాసుల కోసం ప్రత్యేక విభాగాలు తెరచింది. భారత్‌లోని రాజకీయ నాయకులు ప్రవాస భారతీయ సంఘాల నేతలతో సాన్నిహిత్యం పెంచుకుని, కీలక సమయాల్లో విరాళాలూ పొందుతున్నారు.

యుద్ధాలు, తిరుగుబాట్లు, ప్రకృతి ప్రకోపాల వల్ల విదేశాల్లో ప్రవాస భారతీయులకు  ఎప్పుడు ఏ కష్టం వచ్చినా భారతదేశం వారిని ఆదుకోవడానికి చప్పున రంగంలోకి దిగుతోంది. ఇది గతంలో ఎరుగని స్థితి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో బర్మా, ఉగాండా, కొన్ని కరీబియన్‌ దేశాల నుంచి ప్రవాసులు నిష్క్రమించాల్సి వచ్చినప్పుడు భారత సర్కారు నేరుగా జోక్యం చేసుకోకుండా, స్వదేశానికి వచ్చినవారికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టేది. కానీ, 1980లలో ఫిజీలో భారతీయులను వేధింపులకు గురిచేసిన సైనిక ప్రభుత్వాన్ని కామన్వెల్త్‌ నుంచి బహిష్కరింపజేయడానికి ఆనాటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పటి నుంచి భారత్‌ వైఖరిలో మార్పు రాసాగింది. కరోనా వైరస్‌ ప్రవాస భారతీయుల ద్వారానే భారత్‌లో పాదం మోపింది. తొలి కరోనా కేసు    వుహాన్‌ నుంచి కేరళకు వచ్చింది. ఆ తరవాత ఇటలీ, స్పెయిన్‌, ఇరాన్‌లలోని భారతీయులు కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి సొంత గడ్డకు తిరిగిరావాలని తహతహలాడసాగారు. కానీ, భారత ప్రభుత్వం విమానాశ్రయాలను బంద్‌ చేయడంతో ఎక్కడి ప్రవాస భారతీయులు అక్కడే ఉండిపోయారు. దేశదేశాల్లో చిక్కుపడిన భారతీయులను తీసుకురావడానికి కావలసిన విమానాలు మనకు లేవు. అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా దేశాల్లోని భారత సంతతివారందరినీ స్వదేశానికి తీసుకొచ్చినా, ఆ తాకిడిని తట్టుకునే సత్తా భారతదేశానికి లేక పెను సంక్షోభం విరుచుకుపడుతుంది. ప్రస్తుతం అన్ని దేశాలూ విమాన ప్రయాణాలను రద్దు చేసినందున కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చేంతవరకు అందరూ ఓర్పుగా వేచిఉండక తప్పదు.

అండగా ఉండాల్సిన తరుణమిది
వైద్యులు, నర్సులు, చికిత్సా సదుపాయాలను పెద్దయెత్తున సమకూర్చుకున్న తరవాత ప్రవాసుల పునరాగమనానికి ఏర్పాట్లు మొదలుపెట్టాలి. అలాగని ప్రవాసులందరూ పొలోమంటూ ఒకేసారి వచ్చేస్తే నిభాయించడమూ కష్టమే. కాబట్టి, విదేశాలకు వలసవెళ్లిన భారతీయ కార్మికులు, నిపుణులకు పరిస్థితులు కుదుటపడేవరకు ఉపాధి నిలబడేట్లు, సమంజస వేతనాలు లభించేట్లు ఆయా ప్రభుత్వాలను ఒప్పించడానికి భారత ప్రభుత్వం కృషిచేయాలి. ఇప్పుడు స్వదేశంలో వలస కార్మికులకు పట్టిన గతి విదేశాల్లోనూ పట్టకుండా జాగ్రత్తపడాలి. మొదటి గల్ఫ్‌ యుద్ధకాలంలో కువైట్‌, ఇరాక్‌లలోని భారతీయ కార్మికులను స్వదేశం తీసుకురావడానికి భారత్‌ హడావుడి చేయడం, ఆ ప్రభుత్వాలకు నచ్చలేదు. తమకు ఎంతో అవసరమైన సమయంలో భారతీయులు నిష్క్రమించడమేమిటని రుసరుసలాడాయి. ఇప్పుడు కూడా పాశ్చాత్య దేశాలకు, గల్ఫ్‌ దేశాలకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. వారు ఉన్నపళాన మనవాళ్లను పంపడానికి సుముఖత చూపకపోవచ్చు. అయితే, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో పరిస్థితి భిన్నంగా ఉంది. తమ దేశంలో ఉన్న విదేశీయుల్లో కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి తామే చికిత్స అందిస్తామని, వైరస్‌ సోకనివారిని మాత్రం తీసుకువెళ్లాలని పలు దేశాలకు యూఏఈ విజ్ఞప్తి చేసింది. దాన్ని ఖాతరు చేయని దేశాలపై వాణిజ్య ఒప్పందాల రద్దు వంటి కఠిన ఆంక్షలకూ సిద్ధమయింది. భారతప్రభుత్వం ఇలా సమస్య పూర్వాపరాలను గమనంలోకి తీసుకుని, మన నిపుణులు, కార్మికులకు అండగా నిలవాలి.

- టీపీ శ్రీనివాసన్‌
(రచయిత- పలు దేశాలకు మాజీ రాయబారి)


మోసాల సుడిలో బ్యాంకులు
ఒడ్డున పడితేనే మనుగడ

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) మార్చి 2014లో రూ.2.16లక్షల కోట్లు ఉన్నాయి. అయిదేళ్ల తరవాత మార్చి 2019నాటికి ఆ మొత్తం రూ.8,06,412 కోట్లకు పెరిగింది. మార్చి 2019 నాటికి దేశంలోని మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థలో నిరర్థక ఆస్తుల మొత్తం విలువ   రూ.11,73,000 కోట్లని అంచనా. 2014-2019 మధ్య అయిదేళ్ల వ్యవధిలో సుమారు రూ.6.60 లక్షల కోట్లమేర రుణాలను భారతీయ బ్యాంకులు రద్దు చేశాయి. ఒక్క 2018-19 వార్షిక సంవత్సరంలోనే రు.2.37 లక్షల కోట్ల రుణాలు రద్దయ్యాయి. ఇక 2012-13లో బ్యాంకుల్లో 4,306 మోసాలు చోటుచేసుకున్నాయి. 2018-19లో వాటి సంఖ్య 6,801కి పెరిగింది. అదే కాలంలో మోసాల వల్ల బ్యాంకులకు వాటిల్లిన నష్టం విలువ   రూ.10.2వేల కోట్ల నుంచి రూ.71.5వేల కోట్లకు ఎగబాకింది. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీల నుంచి వెలుగులోకి వచ్చిన మోసాల పరంపర చిట్టాను విశ్లేషిస్తే కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలు బ్యాంకింగ్‌ రంగ పర్యవేక్షణలో సమష్టిగా విఫలమయ్యాయని చెప్పక తప్పదు!

రఘురాం రాజన్‌ ఆర్‌బీఐ గవర్నరుగా ఉన్న సమయంలో (ఫిబ్రవరి 2015లో) పెద్దయెత్తున రుణాలు తీసుకుని ఎగవేసే అవకాశాలున్న అనుమానాస్పద బడా పారిశ్రామికవేత్తల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయానికి సీల్డుకవరులో అందజేశారు. వారంతా రాజకీయ ప్రాబల్యం కలిగినవారే. దిద్దుబాటు చర్యలు తీసుకునే విషయంలో సమష్టి కార్యాచరణ అవసరమని ఆ లేఖలో రఘురాం రాజన్‌ తెలిపారు. కానీ, ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయాన్ని పార్లమెంటులో వెల్లడించలేదు. 2018 ఆగస్టులో వివరాలు బయటకు పొక్కాయి. దీంతో రఘురాం రాజన్‌ సమర్పించిన జాబితాలోని బడా పారిశ్రామికవేత్తల పూర్తి వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎమ్‌ఓ) వెల్లడించాలని సమాచార హక్కు చట్టం కింద వ్యాజ్యం దాఖలైంది. అక్టోబరు నెలలో పీఎమ్‌ఓ స్పందించింది. ఆర్‌బీఐ నుంచి లేఖ రావడం నిజమేనని అంగీకరించింది. వివరాల వెల్లడికి మాత్రం నిరాకరించింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పునకు తలొగ్గి నిరుడు నవంబరులో రూ.50వేల కోట్ల మేర బకాయీలను ఎగ్గొట్టిన 30 పారిశ్రామిక సంస్థల వివరాలను బయటపెట్టింది.

కేంద్ర ప్రభుత్వ అధీనంలోని మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలులో జాప్యంవల్ల పెరిగిన పెట్టుబడుల మూలవ్యయం 2012 మే నెలలో రూ.52,445 కోట్లు. అది ఇంతలంతలుగా పెరిగి 2019 మార్చినాటికి రూ.3,30,243 కోట్లకు చేరింది. దీని ప్రభావంవల్ల అనేక మౌలిక వసతుల నిర్మాణ సంస్థలపై తీవ్ర ప్రభావం పడి, అవి భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. 2019నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు రూ.9.4 లక్షలకోట్లు. అందులో మౌలిక రంగ సంస్థలకు చెందినవే రూ.4.1 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వ విధానాలతో విభేదించినప్పటికీ డాక్టర్‌ రఘురాం రాజన్‌ ఆర్‌బీఐ గవర్నరుగా పూర్తి పదవీ కాలం పనిచేశారు. ఆయన స్థానంలో నియమితులైన ఉర్జిత్‌ పటేల్‌ మాత్రం తొమ్మిది నెలల పదవీ కాలం ఉండగానే 2018 డిసెంబరులో రాజీనామా చేశారు. 2019 జనవరిలో డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య తన పదవీ కాలం ఇంకా ఆరు నెలలు ఉందనగా పదవీ విరమణ చేశారు. 2019 మార్చినాటి గణాంకాల ప్రకారం బ్యాంకింగ్‌ వ్యవస్థలోని మొత్తం రుణాల్లో 53 శాతం, నిరర్థక ఆస్తుల్లో   82.2 శాతం బడా పారిశ్రామికవేత్తలకు చెందినవిగా తెలుస్తోంది. విమానయాన, టెలికాం రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. నష్టాల్లో కూరుకుపోయిన ఈ రెండు రంగాల బడా పారిశ్రామిక సంస్థలకు భారీ రుణాలు ఇవ్వడంతో- కొన్ని బ్యాంకుల పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది. దీనికితోడు ప్రస్తుత కరోనా కల్లోలం దేశ ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. బ్యాంకుల విలీనం ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనం అవుతుందే కానీ, శాశ్వత పరిష్కారం ఎంత మాత్రం కాజాలదు!

బ్యాంకుల స్థితిగతులు శాశ్వతంగా గాడిలో పడటానికి ప్రభుత్వపరంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆర్‌బీఐకి స్వయంప్రతిపత్తి కల్పన అందులో మొదటిది. ఆర్‌బీఐ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించాలి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో  ప్రభుత్వం వాటాను 33 శాతానికి నియంత్రించాలి. తన ఆర్థిక విధానాల్లో పారదర్శకత పాటించాలి. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే సమయంలో ఏకపక్షంగా వ్యవహరించకుండా, ఆయా రంగాలకు సంబంధించి నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. బ్యాంకింగ్‌ రంగంలో నానాటికీ జటిలమవుతున్న సమస్యలు; దేశంలో, అంతర్జాతీయంగా ముసురుతున్న ఆర్థిక సంక్షోభం, ఉప్పెనలా ముంచుకొచ్చిన కరోనా పెను విపత్తు... వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బ్యాంకులను కాపాడే ప్రణాళికలను రూపొందించాలి.
- బీఎన్‌వీ పార్థసారథి
Tags :

మరిన్ని