అమెరికాలో ఒక్కరోజే 2,129 మరణాలు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో ఒక్కరోజే 2,129 మరణాలు

ఒక్కరోజు మరణాల్లో ఇదే అత్యధికం

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి అమెరికాను మృత్యుపాశంలా వెంటాడుతోంది. వైరస్‌ బారిన పడి ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య తాజాగా 25 వేలు దాటింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో మంగళవారమే అత్యధికంగా సంభవించాయి. ఇక వైరస్ సోకిన వారి సంఖ్య ఆరు లక్షలు దాటింది. 

మంగళవారం అగ్రరాజ్యంలో 2,129 మంది వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు నమోదైన ఒక్కరోజు మరణాల్లో ఇదే అత్యధికం. దీంతో అక్కడ మృతుల సంఖ్య 25,981కి పెరిగింది.  ఇక ఇప్పటి వరకు 6,05,000 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌లో మరణాల సంఖ్య 10,842కు పెరిగింది. బాధితుల సంఖ్య 2,03,020కు చేరింది. వైరస్‌పై చేస్తున్న పోరులో క్రమంగా పురోగతి సాధిస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. కంటికి కనపడని శత్రువుతో పోరాడి మరణించిన వారి త్యాగాలను వృథా పోనివ్వమని వ్యాఖ్యానించారు. ఇంతటి చీకటి దినాల్లోనూ వెలుగు రేఖలు కనిపిస్తున్నాయన్నారు. పరోక్షంగా పలు ప్రాంతాల్లో వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతుండడాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే అత్యధిక తలసరి ఐసీయూలు ఉన్నాయని తెలిపారు. అలాగే 16,000 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు. 

ఇక రోగుల లాలాజలంతో పరీక్షించే విధానాన్ని రట్‌గర్స్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిందని ట్రంప్‌ వెల్లడించారు. ఈ విధానంలో రోగులు వారి పరీక్షను వారే నిర్వహించకోవచ్చునన్నారు. తద్వారా వైద్య సిబ్బంది వైరస్‌ బారినపడకుండా ఇది దోహదం చేయనుందన్నారు. 

ఇక రాష్ట్రాల్లో విధించిన షట్‌డౌన్‌ను ఎత్తివేసే నిర్ణయం విషయంలో ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది! ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థలను తెరిచే నిర్ణయాన్ని గవర్నర్లకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. పటిష్ఠమైన పునుద్ధరణ పథకంతో రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేయోచ్చని తెలిపారు.

ఇవీ చదవండి...
డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేసిన ట్రంప్‌

హెచ్‌-1బీ వీసాదారులకు ఊరట


మరిన్ని