అమెరికా పునరుద్ధరణలో ఆరుగురు ఇండియన్లు!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికా పునరుద్ధరణలో ఆరుగురు ఇండియన్లు!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విజృంభణతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కార్యాచరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన 200 మంది నిపుణులతో వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సహా భారత నేపథ్యం ఉన్న మొత్తం ఆరుగురు ఎంపికయ్యారు. వీరంతా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అనుసరించాల్సిన ప్రణాళికలను, సలహాలను అధ్యక్షుడికి అందించనున్నారు. ‘‘వివిధ రంగాల్లో ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యంగల వారిని ఎంపిక చేశాం. వారంతా మాకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు’’ అని ట్రంప్‌ అన్నారు.

పిచాయ్‌, నాదెళ్లతో పాటు ఐబీఎం సీఈఓ అరవింద్‌ కృష్ణ, మైక్రాన్‌ సీఈఓ సంజయ్‌ మెహ్రోత్ర ఉన్నారు. వీరంతా సమాచార సాంకేతిక రంగం ఎదుర్కొంటున్న ఒడుదొడుకుల్ని ఎలా అధిగమించాలో అధ్యక్షుడికి సూచిస్తారు. ఇక పెర్నాడ్‌ రికార్డ్‌ బివరేజ్‌ కంపెనీ సీఈఓ ఆన్‌ ముఖర్జీని ఉత్పత్తి రంగం పునరుత్తేజానికి కావాల్సిన సూచనలిచ్చే బృందానికి ఎంపిక చేశారు. మాస్టర్‌ కార్డ్‌కు చెందిన అజయ్ బంగా ఆర్థిక రంగ పునరుద్ధరణ బృందంలో ఉన్నారు. ఇలా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు వ్యవసాయ, బ్యాంకింగ్‌, నిర్మాణ, కార్మిక, రక్షణ, ఇంధన, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, పర్యాటక, తయారీ, స్థిరాస్తి, రిటైల్‌, సాంకేతికత, రవాణా, క్రీడల ఇలా ఒక్కో రంగానికి ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయా రంగాల్లో నిపుణులను ఎంపిక చేసి వారి సలహాలు తీసుకోనున్నారు. మరోవైపు అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలకు చెందిన బృందాలు కూడా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నాయి. 


మరిన్ని