గంటకు 107 మంది బలి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గంటకు 107 మంది బలి

అమెరికాలో కరోనా విలయ తాండవం
24 గంటల్లో 2,569 మంది మృత్యువాత
33 వేలు దాటిన మొత్తం మరణాలు
కేసుల నమోదులో గరిష్ఠ స్థితిని దాటేశామన్న ట్రంప్‌
ప్రపంచవ్యాప్తంగా 21 లక్షలు దాటిన కరోనా కేసులు

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 2,569 మంది ప్రాణాలను వైరస్‌ బలి తీసుకుంది. అంటే సగటున గంటకు 107 మంది నుదుటన మరణ శాసనం రాసిందన్నమాట. తాజా మృతులతో కలిపి, అగ్రరాజ్యంలో కరోనా దెబ్బకు కన్నుమూసినవారి సంఖ్య 33 వేలు దాటింది. ఇక వైరస్‌ సోకిన వారి సంఖ్య ఆరున్నర లక్షల పైకి ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. ఇప్పటివరకు 21 లక్షల మందికిపైగా ఈ వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 5.25 లక్షల మందికి పైగా కోలుకున్నారు. మరణాలు ఎక్కువైనప్పటికీ.. తమ దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. కొవిడ్‌ కేసుల నమోదు విషయంలో గరిష్ఠ స్థితిని తాము ఇప్పటికే దాటేశామని పేర్కొన్నారు. కరోనా మృతుల విషయంలో కొన్ని దేశాలు అబద్ధాలు చెబుతున్నాయని ట్రంప్‌ ఆరోపించారు.  న్యూయార్క్‌లో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు గవర్నర్‌ ఆండ్రూ క్యూమో ప్రకటించారు.

నర్సింగ్‌ హోంలో 17 మృతదేహాలు
న్యూజెర్సీ రాష్ట్రంలోని ఓ నర్సింగ్‌ హోంలో 17 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. కేవలం 4 శవాలను భద్రపర్చేందుకు వీలుగా నిర్మించి ఉన్న గదిలో 17 మృతదేహాలను కుక్కి ఉంచినట్లు గుర్తించారు.


2.2 కోట్ల ఉద్యోగాలు మాయం

కరోనా సంక్షోభంతో అమెరికాలో రెండు కోట్ల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగులకు కల్పించే భృతి, ఇతర ప్రయోజనాలను కోరుతూ గత నెల్లో 2.2 కోట్ల మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల్లో అమెరికాలో నిరుద్యోగిత రేటు దాదాపు 20 శాతానికి చేరుకునే ముప్పుందని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 1930ల్లో మహా మాంద్యం తర్వాత ఆ దేశంలో ఎప్పుడూ నిరుద్యోగిత రేటు ఈ స్థాయికి పెరగలేదని పేర్కొన్నారు.


ఫ్రాన్స్‌ విమానవాహక నౌకపై 668 మందికి కరోనా

ఫ్రాన్స్‌ విమానవాహక నౌక చార్లెస్‌ డి గాలెపై విధులు నిర్వర్తిస్తున్న నావికుల్లో 668 మందికి కరోనా సోకింది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో విన్యాసాలు నిర్వహించేందుకు ఇటీవల సదరు భారీ నౌకను పంపించారు. దానిపై దాదాపు రెండు వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.


పాక్‌లో 7 వేలకు చేరువలో..

పాకిస్థాన్‌లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. ఆ దేశంలో వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 6,919కి పెరిగింది. ఇప్పటివరకు 128 మరణాలు నమోదయ్యాయి. కరోనాను నిలువరించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టుకు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను తన సలహాదారు(ఆరోగ్య వ్యవహారాలు) డాక్టర్‌ జాఫర్‌ మీర్జాపై పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మండిపడ్డారు.
* స్పెయిన్‌లో కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 19 వేలు దాటింది. తాజాగా ఆ దేశంలో 551 మరణాలు నమోదయ్యాయి.
* లాక్‌డౌన్‌ను మరో మూడు వారాలపాటు (వచ్చే నెల 7 వరకు) పొడిగిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. ఆ దేశంలో తాజాగా 861 మంది మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 13 వేలు దాటింది.
* కరోనా సంక్షోభం నుంచి ఐరోపా ఇంకా బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వ్యాఖ్యానించింది. స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల్లో కేసులు తగ్గుముఖం పట్టినా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
* వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే టోక్యోలో విధించిన ఆత్యయిక స్థితిని ఇతర పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేస్తున్నట్లు జపాన్‌ ప్రధాని షింజో అబె గురువారం ప్రకటించారు.
* కరోనా విజృంభణ తొలినాళ్లలో మిలన్‌లోని ఓ సంరక్షణ కేంద్రంలో దాదాపు 200 మంది అనుమానాస్పద స్థితిలో మృత్యువాతపడిన వ్యవహారంపై ఇటలీలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు


నవంబర్‌లో మరోసారి కరోనా దాడి!
చైనా వైద్య నిపుణుడి హెచ్చరిక

బీజింగ్‌: కరోనా కోరల నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడు బయటపడ్డా నవంబర్‌లో ఆ మహమ్మారి తిరిగి మరోసారి దాడిచేసే అవకాశం ఉందని చైనా వైద్య నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. కరోనా నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ విషయం మింగుడుపడనిదే. షాంఘైలోని ‘కొవిడ్‌-19 క్లినికల్‌ ఎక్స్‌పర్ట్‌ టీం’ కు నేతృత్వం వహిస్తున్న జాంగ్‌ వెన్‌హాంగ్‌ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కరోనా మళ్లీ మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా విధానాలను రూపొందించుకోవాలని తెలిపారు.

Tags :

మరిన్ని