ఆ రహస్యం ట్రంప్‌ చెవికెక్కలేదు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ రహస్యం ట్రంప్‌ చెవికెక్కలేదు

కరోనా ఉద్ధృతిని ముందే పసిగట్టిన అమెరికా రహస్య విభాగం

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ ఈ ఏడాది ఫిబ్రవరిలో.. ఆ ఇన్‌ఫెక్షన్‌ గురించి ఏ మాత్రం హైరానా పడాల్సిన పనిలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన దేశవాసులకు భరోసా ఇచ్చారు. అమెరికా సైన్యంలోని ఒక రహస్య విభాగం అదే రోజు భిన్నమైన హెచ్చరిక చేసింది. అమెరికాలో ఆ వ్యాధి పేట్రేగిపోనుందని తేల్చి చెప్పింది. చివరికి ఈ విభాగం వాదనే నిజమైంది. ఏ మాత్రం ఆందోళన అవసరం లేదన్న ట్రంప్‌ కూడా రెండుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ రహస్య విభాగం పేరు ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెడికల్‌ ఇంటెలిజెన్స్‌’. మేరీల్యాండ్‌లోని ఫోర్ట్‌ డెట్రిక్‌ కేంద్రంగా ఇది కార్యకలాపాలు సాగిస్తోంది. విదేశాల్లో ఉన్న అమెరికన్‌ సైనికులు, స్వదేశంలోని ప్రజలకు హాని కలిగించే ప్రపంచ ఆరోగ్య ముప్పులపై నిరంతరం పరిశీలన జరపడం దీని విధి. కరోనా ఒక ప్రపంచ మహమ్మారి అవుతుందని ఫిబ్రవరి 25న ఈ విభాగం పేర్కొంది.

ఏమిటీ విభాగం
అంటు వ్యాధులు, మహమ్మారులతో అమెరికా సైనిక బలగాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. స్పానిష్‌-అమెరికన్‌ యుద్ధంలో టైఫాయిడ్‌ జ్వరం, రక్త విరేచనాల మహమ్మారులు విజృంభించాయి. ఇలాంటివాటితో తలెత్తే ముప్పు గురించి సైనిక కమాండర్లు నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా ఈ మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం సిద్ధమైంది. అంటు వ్యాధులను నివారించేలా ముందస్తు హెచ్చరికలను ఇది చేస్తోంది.

ఎవరుంటారు?
మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కనీసం వంద మంది అంటువ్యాధుల నిపుణులు, వైరాలజిస్టులు, రసాయన ఇంజినీర్లు, టాక్సికాలజిస్టులు, జీవశాస్త్రవేత్తలు, సైనిక వైద్య నిపుణులు పనిచేస్తున్నారు.

విశ్లేషణ ఎలా?
ఈ విభాగంలోని నిపుణులు అంతర్జాతీయ ఆరోగ్య పరిణామాలపై నిరంతరం భారీగా సమాచారాన్ని విశ్లేషిస్తుంటారు. ఉదాహరణకు.. ఆఫ్రికాలో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నట్లు అక్కడి పత్రికలో కథనం వస్తే ఈ విభాగం అప్రమత్తమవుతుంది. మొత్తం మీద అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులతో తలెత్తే ఆరోగ్యపరమైన ముప్పులు; విషతుల్య పదార్థాలు, జీవ ఉగ్రవాదంపైన, వాటిని నిర్వహించే సామర్థ్యమున్న కొన్ని దేశాలపైన కన్నేసి ఉంచుతుంది. దీనికితోడు అమెరికాలోని 17 నిఘా సంస్థలు సేకరించిన సమాచారం కూడా ఈ విభాగం నిపుణులకు అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు నేషనల్‌ జియోస్పేషియల్‌-ఇంటెలిజెన్స్‌ సంస్థ ఉపగ్రహ చిత్రాలు, ఉపరితల మ్యాప్‌లను అందిస్తుంది. ఎబోలా, ఎవియన్‌ ఫ్లూ వంటి మహమ్మారులు వ్యాప్తి చెందే తీరుపై విశ్లేషణ వేయడానికి వీటిని మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఉపయోగించుకుంటారు. మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల పరిశీలనల ఆధారంగా వైద్య నిఘా విశ్లేషణలు, డేటాబేస్‌లు తయారవుతాయి. వీటిని నివేదికల రూపంలో సైనిక కమాండర్లకు, రక్షణశాఖలోని ఆరోగ్య అధికారులకు, పరిశోధకులకు, రక్షణ శాఖ, వైట్‌హౌస్‌లోని విధాన నిర్ణేతలకు, ఫెడరల్‌ సంస్థలకు అందజేస్తారు.


చైనా ల్యాబ్‌ నుంచే వచ్చిందా!

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాలపై అమెరికా దర్యాప్తు సాగించనుంది. చైనాలోని వుహాన్‌లో గబ్బిలాలపై పరిశోధనలు సాగిస్తున్న ఒక ప్రయోగశాల నుంచి ఇది వెలువడి ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఇక్కడి అధికారులు తెలిపారు. ‘వెట్‌ మార్కెట్‌’లో ఈ వైరస్‌ మానవులకు వ్యాప్తి చెంది ఉంటుందని చైనా పేర్కొంది. అయితే అమెరికాలోని రెండు ప్రసార మాధ్యమాలు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కథనాలను ప్రచురించాయి. వుహాన్‌లోని అత్యంత సున్నితమైన జీవ పరిశోధన కేంద్రం నుంచి ప్రమాదవశాత్తు ఈ వైరస్‌ లీకై ఉండొచ్చని తెలిపాయి. ‘‘దీనిపై మేం పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నాం. ఇది ఎలా బయటకు వచ్చింది? ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించింది? అమెరికాలో ఇన్ని మరణాలను ఎలా కలిగించింది అన్నది తేలాలి’’ అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు.

Tags :

మరిన్ని