‘చైనాపై అంతర్జాతీయ విచారణ జరగాల్సిందే’
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
‘చైనాపై అంతర్జాతీయ విచారణ జరగాల్సిందే’

ట్రంప్‌ను కోరిన కీలక సెనెటర్ల బృందం

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19) పుట్టుకకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా దీనిపై విచారణ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా అగ్రరాజ్యానికి చెందిన కీలక సెనెటర్ల బృందం అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయంలో కొన్ని సూచనలు చేసింది. విచారణలో అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌ సహా ఇతర ఐరోపా దేశాలతో కలిసి పనిచేయాలని కోరింది. తద్వారా విచారణ పారదర్శకంగా, విశ్వసనీయంగా సాగుతుందని హితవు పలికింది. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ణయాధికారం విషయంలోనూ దర్యాప్తు సాగాలని సెనెటర్లు సూచించారు. ఈ మేరకు గురువారం రిపబ్లికన్‌ సెనెటర్‌ మాక్రో రూబియో నేతృత్వంలోని ఓ బృందం ట్రంప్‌నకు లేఖ అందజేసింది.  

ఈ విచారణ కోసం ప్రత్యేకంగా ఓ ఉన్నతస్థాయి దౌత్యవేత్తలను నియమించాలని సెనెటర్లు అధ్యక్షుడిని కోరారు. ఇటు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వైరస్‌కు సంబంధించిన ఇతర అంశాల్లోనూ విచారణ సాగాలని సూచించారు. 

వుహాన్‌లో వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని సెనెటర్లు ఆరోపించారు. చివరకు అమెరికాను సైతం దోషిని చేసేందుకు ప్రయత్నించిందని గుర్తుచేశారు. వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చిన వెంటనే దీని పుట్టుక, అంతర్జాతీయ సంస్థల అధికారాన్ని ప్రభావితం చేయడంలో చైనా పాత్రపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తైవాన్‌ హెచ్చరికల్ని డబ్ల్యూహెచ్‌ఓ బేఖాతరు చేయడంలో సీసీపీ ప్రభావం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరగాలని సూచించారు.

ఇవీ చదవండి..

ఆ రహస్యం ట్రంప్‌ చెవికెక్కలేదు

గంటకు 107 మంది బలి


మరిన్ని