అమెరికాలో కొవిడ్‌ కరాళనృత్యం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో కొవిడ్‌ కరాళనృత్యం

24 గంటల్లో 4,491 మరణాలు

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి వికృతరూపం దాల్చింది. అమెరికా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆదేశంలో ఏకంగా 4,491 మంది ఈ వైరస్‌ ధాటికి బలయ్యారు. దీంతో అమెరికాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 34,562కి చేరింది. వైరస్‌ మొదలైన నాటి నుంచి ఇంతమంది ఒకే రోజు మరణించడం ఇదే తొలిసారి. అయితే, గురువారం వెల్లడించిన మృతుల సంఖ్యలో కరోనా అనుమానిత మరణాలను కూడా కలిపి లెక్కించడం గమనార్హం. అంతకుముందు ఇలాంటి అనుమానిత కేసుల్ని కలపలేదు. నిన్నటి నుంచే అనుమానిత మరణాలను కూడా కరోనా మృతుల కింద పరిగణించడంతో ఒకేసారి భారీగా మరణాల సంఖ్య పెరిగింది. 

మరోవైపు న్యూయార్క్‌ నగర యంత్రాంగం కూడా ఈవారంలో 3,778 అనుమానిత కేసుల్ని కరోనా మృతులుగా పరిగణిస్తామని వెల్లడించింది. అమెరికాలో మొత్తం బాధితుల సంఖ్య 6,75,243కు పెరగడంతో గత రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. 22,170 కరోనా మరణాలతో ఇటలీ రెండో స్థానం.. 19,516 స్పెయిన్‌ మూడు, 17,920 ఫ్రాన్స్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. అలాగే అమెరికాలో వైరస్‌ వ్యాప్తికి కేంద్ర బిందువైన న్యూయార్క్‌ రాష్ట్రంలోనే అత్యధికంగా 12 వేల మంది మృతిచెందారు. ఇక దేశంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఆంక్షలను సడలించే పూర్తి అధికారాల్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లకే వదిలేస్తున్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 

ఇవి చదవండి:

ఆ రహస్యం ట్రంప్‌ చెవికెక్కలేదు

కరోనా టీకాకు 2 నెలల్లో ఓ రూపు


మరిన్ని