దుబాయ్‌ దుమారం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దుబాయ్‌ దుమారం

26 రోజుల తరువాత ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌

ఎక్కడ సోకిందో తెలియక అధికారుల హైరానా

వంద మందికిపైగా అనుమానితులు గృహ నిర్బంధంలో

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

దుబాయ్‌ నుంచి వచ్చిన వేల మందికి కరోనా పరీక్షలు చేయకుండా వదిలేయడంతో ప్రస్తుతం అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎలాంటి అనుమానిత లక్షణాలు కనిపించకుండానే కరోనా పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌ నుంచి వచ్చిన కొంతమందికైనా పరీక్షలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వైద్యులు చెబుతున్నారు. విదేశాల నుంచి జిల్లాకు 3,494 మంది రాగా వారిలో రెండు వేల మంది గల్ఫ్‌ నుంచి వచ్చిన వారే ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికీ రక్తనమూనాలు సేకరించిన దాఖలాలు లేవు.

గత నెల 19న దుబాయ్‌ నుంచి వచ్చిన మానిక్‌బండార్‌కు చెందిన వ్యక్తికి 26 రోజుల తరువాత కరోనా పాజిటివ్‌ రావడంతో ఇప్పుడు మిగతా గల్ఫ్‌వాసులు ఆందోళన చెందుతున్నారు. అతని ఇల్లు చిన్నదిగా ఉండడంతో మార్చి 30న మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల క్రితం అతనికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది.

వివాహానికి హాజరు

విదేశాల నుంచి వచ్చిన వారు ఇంట్లోనే ఉండాలని హెచ్చరిస్తున్నా కొందరు చెవిన పెట్టడం లేదు. మానిక్‌బండార్‌కు చెందిన వ్యక్తి దుబాయ్‌ నుంచి వచ్చిన తరువాత 12 రోజులు ఇంట్లోనే ఉన్నాడు. తరువాత స్నేహితులైన ఇద్దరు ఫొటోగ్రాఫర్లతో కలిసి ఒక వివాహం చిత్రీకరణకు వెళ్లారు. ప్రస్తుతం అతని కుటుంబసభ్యులను, ఇద్దరు ఫొటోగ్రాఫర్లను మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వివాహ వేడుకలో వీరికి దగ్గరగా తిరిగిన 84 మంది సెకండరీ కాంటాక్ట్‌ వ్యక్తులను గుర్తించి ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో ఉంచారు.

అదే విమానంలో 20 మంది

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ప్రయాణం చేసిన విమానంలోనే జిల్లాకు చెందిన 20 మంది వచ్చారు. వారిని కూడా గుర్తించి మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

సోకిందెక్కడ

మానిక్‌బండార్‌కు చెందిన వ్యక్తి గత నెల 18న విమానంలో ముంబయికి వచ్చారు. అక్కడి నుంచి దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్‌ దొరకకపోవడంతో జనరల్‌ బోగీలో 19న జిల్లాకు చేరుకున్నారు. ఇప్పుడు వైరస్‌ సోకింది దుబాయ్‌లోనా.. విమానంలోనా.. రైల్లోనా అన్నది తేలడం లేదు. 17 రోజులపాటు మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నాడు. అక్కడ దిల్లీకి వెళ్లి వచ్చిన వారి కుటుంబసభ్యులు ఉండడంతో వారి నుంచి సోకి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరో ముగ్గురికి...

 జిల్లాలో 58కి చేరిన కేసులు

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 58కి చేరిందన్నారు. బుధవారం 63 మంది అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలు పరీక్షలకు పంపగా 60 మంది నివేదికలు వచ్చినట్లు చెప్పారు. ఇందులో 57 మందికి నెగెటివ్‌, ముగ్గురికి పాజిటివ్‌ ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 527 మంది నమూనాలు పరీక్షలకు పంపించినట్లు పాలనాధికారి తెలిపారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌కు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా అతని భార్య, కుమారుడు, కూతురిని క్వారంటైన్‌కు తరలించారు. వారి రక్త నమూనాలు పరీక్షలకు పంపగా అందరికి పాజిటివ్‌ వచ్చినట్లు గురువారం అధికారులు ప్రకటించారు.

Tags :

మరిన్ని