నిమిషానికి ముగ్గురి మృతి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నిమిషానికి ముగ్గురి మృతి

అమెరికాలో కరోనా ఉగ్రరూపం
24 గంటల్లో 4,591 మంది మృత్యువాత
35 వేలు దాటిన మరణాల సంఖ్య
7 లక్షలకు చేరువలో బాధితులు
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి 3 దశల ప్రణాళిక
కరోనా మరణాలపై మాట మార్చిన చైనా
వుహాన్‌లో మృతుల సంఖ్యకు సవరణ

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని రీతిలో కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ మరింత ప్రళయాంతక రూపం దాలుస్తోంది. తాజాగా అక్కడ 24 గంటల్లోనే 4,591 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అంటే సగటున నిమిషానికి కనీసం ముగ్గురు చొప్పున ఈ వైరస్‌ దెబ్బకు మృత్యువాతపడ్డారన్నమాట. మరోవైపు, కరోనా విజృంభణపై వాస్తవాలను కప్పిపుచ్చుతోందంటూ చైనాపై అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాలు గుప్పిస్తున్న ఆరోపణలు నిజమేనని స్పష్టమవుతోంది! ఈ వైరస్‌ పురుడు పోసుకున్న వుహాన్‌ నగరంలో మృతులు, కేసుల లెక్కలను డ్రాగన్‌ దేశం తాజాగా సవరించింది. నగరంలో అదనంగా 50% మరణాలను లెక్కల్లో చేర్చింది. అమెరికాలో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల మధ్య కరోనా దెబ్బకు సగటున గంటకు 107 మంది మరణించారు. ఆ తర్వాతి 24 గంటల్లో వైరస్‌ మరింత ఉగ్రరూపం దాల్చి 4,591 మందిని బలి తీసుకుంది. అంటే గంటకు 191 మంది మరణించారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 35 వేలు దాటింది. ఒక్క న్యూయార్క్‌లోనే 16 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది.

చైనాపై చట్టపరమైన చర్యలకు ఊతమిచ్చేలా..
మరోవైపు చైనాపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేందుకు నూతన చట్టాన్ని తీసుకొచ్చేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది! ఈ మహమ్మారి కారణంగా సంభవించిన మరణాలు, ఆర్థిక నష్టానికి పరిహారం కోరుతూ చైనాపై ఫెడరల్‌ కోర్టులో అమెరికన్లు దావా వేసేందుకు వీలు కల్పించే బిల్లును సెనేట్‌లో టామ్‌ కాటన్‌, ప్రతినిధుల సభలో డ్యాన్‌ క్రెన్‌షా ప్రవేశపెట్టారు. కరోనా ముప్పు సంగతి ఆదిలోనే బయటకు తెలియకుండా చైనా దాచిపెట్టిందని అందులో ఆరోపించారు. ఫలితంగా వైరస్‌ వ్యాప్తి పెరిగిందని పేర్కొన్నారు.

చైనా కొత్త లెక్కలు
కరోనా ఉద్ధృతిపై పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ అమెరికా సహా పలు దేశాలు విమర్శలతో విరుచుకుపడుతున్నవేళ చైనా స్పందించింది. వైరస్‌ పుట్టుకకు కేంద్రమైన వుహాన్‌లో మరణాల సంఖ్యను సవరించింది. కరోనా జాబితాలో కొత్తగా 1,290 మరణాలను చేర్చింది. దీంతో వుహాన్‌లో వైరస్‌ దెబ్బకు కన్నుమూసినవారి సంఖ్య 3,869కి పెరిగింది. 325 కేసులను కూడా కొత్తగా కలిపి.. నగరంలో మొత్తం బాధితుల సంఖ్యను 50,333గా పేర్కొంది. దీంతో చైనాలో కరోనా బాధితుల సంఖ్య 82,692కు, మృతుల సంఖ్య 4,632కు పెరిగింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రుల సంఖ్యను ఒక్కసారిగా గణనీయంగా పెంచామని.. ఆ సమయంలో కొన్ని వైద్య కేంద్రాల నుంచి సరైన లెక్కలు అందలేదని, అందుకే ఇప్పుడు లెక్కలు సవరించామని చైనా వివరణ ఇచ్చింది. వైరస్‌ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో పలువురు ఇళ్లలోనే మరణించారని తెలిపింది. ప్రస్తుతం సంబంధిత లెక్కలన్నీ అందుబాటులోకి రావడంతో సవరణలు చేపట్టామని వివరించింది.

అమెరికాలో దశలవారీగా ఆంక్షల ఎత్తివేత
ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిచేందుకు మూడు దశల ప్రణాళికను ట్రంప్‌ తాజాగా ఆవిష్కరించారు. సదరు మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా రాష్ట్రాల్లో నిషేధాజ్ఞలను దశలవారీగా సడలించే అధికారాన్ని గవర్నర్లకు కట్టబెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి అమెరికాలోని అత్యుత్తమ వైద్య నిపుణులు 18 పేజీల తాజా మార్గదర్శకాలను రూపొందించారు. వరుసగా 14 రోజులపాటు కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తే తొలి దశ మొదలవుతుంది. ఆ తర్వాత కూడా 14 రోజుల చొప్పున గడిచేకొద్దీ వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడితే 2, 3 దశలు ప్రారంభమవుతాయి. ఆయా దశల్లో నిబంధనలు ఎలా ఉంటాయంటే..

తొలి దశ
భౌతిక దూరం ప్రమాణాలను పాటించాలి.
10 మంది కంటే ఎక్కువ గుమికూడొద్దు.
అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలి.
వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఇళ్లకే పరిమితమవ్వాలి.
బార్లను తెరవకూడదు.
వ్యాయామశాలలను తెరవొచ్చు. భౌతిక దూరం, శానిటేషన్‌ ప్రొటోకాల్‌ అమలయ్యేలా చూడాలి.
ఇళ్ల నుంచే పని(వర్క్‌ ఫ్రం హోం) చేయడాన్ని ప్రోత్సహించాలి.

రెండో దశ
పాఠశాలలను తెరవొచ్చు.
అత్యవసరం కాకున్నా ప్రయాణాలు చేయొచ్చు.
ఇళ్ల నుంచే పని(వర్క్‌ ఫ్రం హోం) చేయడాన్ని ప్రోత్సహించాలి.
సినిమా హాళ్లను పునఃప్రారంభించొచ్చు. వాటిలో భౌతిక దూరం పాటించాల్సిందే.

మూడో దశ
దాదాపుగా నిషేధాజ్ఞలన్నింటినీ ఎత్తివేయాలి.
నర్సింగ్‌హోంలు, ఆస్పత్రులకువెళ్లేందుకు అనుమతి.
వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తులు బయటకు రావొచ్చు. అయితే, వారు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి.

 

లండన్‌లో బస్సు డ్రైవర్లకు ముప్పు

లండన్‌లో ఇప్పటివరకు 20 మంది బస్సు డ్రైవర్లు కరోనా దెబ్బకు మృతిచెందారు. దీంతో ప్రయాణికులెవరూ ముందు డోరు నుంచి బస్సు ఎక్కకుండా నిషేధం విధించారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ అత్యవసర సేవల సిబ్బంది కోసం లండన్‌లో పరిమిత సంఖ్యలో బస్సుల్ని నడిపిస్తున్నారు.
రష్యాలో 24 గంటల్లో 4,070 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 32 వేలు దాటింది. ఇప్పటివరకు ఆ దేశంలో 273 మంది మృత్యువాతపడ్డారు.

Tags :

మరిన్ని