‘వుహాన్‌ ల్యాబ్‌’పై అమెరికా నిఘా!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
‘వుహాన్‌ ల్యాబ్‌’పై అమెరికా నిఘా!

అక్కడి నుంచి వైరస్‌ ఎలా వచ్చిందన్న నివేదికల విశ్లేషణ
కచ్చితమైన నిర్ధారణకు వస్తున్నట్టు ట్రంప్‌ వెల్లడి

వాషింగ్టన్‌: ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ పుట్టిల్లు... చైనాలోని వుహాన్‌ నగరంలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌పై అమెరికా దృష్టి సారించింది. ఈ ల్యాబ్‌ నుంచి వైరస్‌ ఎలా బయటకు వచ్చింది? అసలు ఇందులో నిజమెంత? అన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు అగ్రరాజ్య నిఘా వ్యవస్థలు పూర్తిస్థాయిలో అత్యంత నిశితంగా అధ్యయనం చేస్తున్నట్టు ఫాక్స్‌ న్యూస్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా అన్యాపదేశంగా ధ్రువీకరించారు. తమ వద్దనున్న సమాచారాన్ని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయని, వైరస్‌ వ్యాప్తికి మూలమేంటన్న విషయమై ఒక నిర్ధారణకు వస్తామని ఆయన పేర్కొన్నారు.

అసలు ఆ గబ్బిలాలు ఎక్కడున్నాయని?
కరోనా విషయంలో చైనా కనబరుస్తున్న ధోరణి పట్ల ట్రంప్‌ గుర్రుగా ఉన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ- ‘‘మహమ్మారికి సంబంధించి అన్ని విషయాలపైనా దర్యాప్తు జరుగుతోంది. వుహాన్‌ నుంచి వ్యాపించిన వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర కష్టం ఎదుర్కొంటున్నాయి. వాళ్లు గబ్బిలం గురించి చెబుతున్నారు. అసలు ఆ జాతి గబ్బిలాలు వుహాన్‌లోనే లేవు. అక్కడి జంతు మాంసం మార్కెట్‌లోనూ వాటిని విక్రయించలేదు. వుహాన్‌కు కనీసం 40 మైళ్ల దూరంలో ఆ రకం గబ్బిలాలున్నాయి’’ అని చెప్పారు. వుహాన్‌లోని లెవెల్‌-4 వైరాలజీ ల్యాబ్‌కు ఒబామా ప్రభుత్వం మంజూరు చేసిన 3.7 మిలియన్‌ డాలర్ల గ్రాంట్‌ను నిలిపివేస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని