‘అదే నిజమైతే చైనాపై తీవ్ర పరిణామాలుంటాయ్‌‌’
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
‘అదే నిజమైతే చైనాపై తీవ్ర పరిణామాలుంటాయ్‌‌’

డ్రాగన్‌ దేశానికి ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: కరోనా వైరస్ విషయంలో చైనా తీరుపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి డ్రాగన్‌ దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనాయే కారణమని తెలితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన అంశాన్ని అంత తేలిగ్గా తీసుకునేదిలేదని స్పష్టం చేశారు. శ్వేతసౌధంలో రోజువారీ విలేకరుల సమావేశంలో భాగంగా శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కరోనా వైరస్‌ వ్యాప్తి విషయం వారికి(చైనా) తెలిసి కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు వెల్లడైతే తీవ్ర చర్యలు ఉండాల్సిందే. 1917 తర్వాత కనీవినీ ఎరుగని ప్రాణనష్టానికి సంబంధించిన అంశం ఇది’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

అప్పుడు సత్సంబంధాలుండేవి..

చైనాపై మారిన తన అభిప్రాయాన్ని కూడా ట్రంప్ ఈ సందర్భంగా వ్యక్తపరిచారు. మహమ్మారి వెలుగులోకి రాకముందు వరకు చైనాతో సత్సంబంధాలు ఉండేవని గుర్తుచేసుకున్నారు. కానీ, వైరస్‌ విజృంభణ పరిస్థితుల్ని ఒక్కసారిగా మార్చేసిందని వ్యాఖ్యానించారు. ‘‘తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కానీ, ఒక్కసారిగా ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చింది. కాబట్టి కచ్చితంగా సంబంధాల విషయంలో భారీ వ్యత్యాసమే ఉంటుంది. చైనాపై ఆగ్రహంగా ఉన్నారా..?అంటే కచ్చితంగా అవుననే అనాల్సి ఉంటుంది. కానీ, ఇది ఆయా సందర్భాలపై కూడా ఆధారపడి ఉండొచ్చు’’ అని ట్రంప్‌ అన్నారు. వైరస్‌ వ్యాప్తి తొలినాళ్లలోనే అమెరికా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చైనా అంగీకరించలేదని గుర్తుచేశారు. వైరస్‌ వల్ల పరిస్థితులు దారుణంగా ఉన్న విషయం వారు ముందే పసిగట్టి ఉంటారని.. అందుకే అమెరికా జోక్యాన్ని ఇష్టపడలేదని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను ఉదహరిస్తూ చైనాను హెచ్చరించే ప్రయత్నం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మొత్తం పశ్చిమాసియానే తన గుప్పిట్లో పెట్టుకునే స్థితిలో ఇరాన్‌ ఉండేదని.. కానీ, ఇప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తోందని చెప్పుకొచ్చారు. పరోక్షంగా తనతో కయ్యం తీవ్ర పరిణామాలకు దారితీస్తోందిన చెప్పకనే చెప్పారు. 

బిడెన్‌కు చైనా మద్దతు..

తాజా పరిస్థితుల్ని అధ్యక్ష ఎన్నికల ప్రచారాస్త్రంగానూ ట్రంప్‌ మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీ డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బిడెన్‌ అభ్యర్థిత్వానికి చైనా మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. ఒకవేళ ఆయన గెలిస్తే అమెరికాను డ్రాగన్‌ దేశం స్వాధీనం చేసుకుంటుందంటూ ఆరోపించారు. బిడెన్‌ వ్యాపార విధానాల వల్ల గతంలో ఆయన పాలకవర్గం చైనా నుంచి భారీ స్థాయిలో ప్రయోజనం పొందిందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

అమెరికా కంటే చైనాలోనే ఎక్కువ..

వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య అమెరికా కంటే చైనాలోనే ఎక్కువగా ఉంటుందని ట్రంప్‌ అంచనా వేశారు. అత్యాధునిక వైద్యారోగ్య వసతులున్న ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాల కంటే చైనాలో మరణాల రేటు తక్కువగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. చైనా చెబుతున్న సంఖ్య అవాస్తవమని ఆరోపించారు. కరోనా కేసులు, మరణాల సంఖ్యను చైనా సవరించిన విషయం తెలిసిందే. వుహాన్‌లో అదనంగా 1,290 మరణాలు చోటుచేసుకున్నాయంటూ... మొత్తం మరణాల సంఖ్యను 4,636గా పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చదవండి..

‘వుహాన్‌ ల్యాబ్‌’పై అమెరికా నిఘా!

దక్షత కొరియా

Tags :

మరిన్ని