ప్రవాసులపై కోవిడ్‌ ప్రతాపం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ప్రవాసులపై కోవిడ్‌ ప్రతాపం

అమెరికాలో తెలుగు కుటుంబాల ఆందోళన
అరబ్‌ దేశాల్లో కార్మికుల బిక్కుబిక్కు
ఆఫ్రికాలోనూ  తప్పని తిప్పలు
ఈనాడు, అమరావతి- ఈనాడు డిజిటల్‌, అమరావతి

ఉన్నత ఉద్యోగం, చక్కటి ఉపాధి, నాణ్యమైన విద్య... ఈ మూడింటి అన్వేషణలో తెలుగువారు ఎప్పుడూ ముందుంటారు. సాంకేతికతపై భరోసాతో అమెరికా వెళ్లినా, రెక్కల కష్టంపై నమ్మకంతో అరేబియా ఎడారుల్లో అడుగిడినా, చదువులమ్మ దీవెనలు ఆకాంక్షిస్తూ ఏదేశమేగినా... అక్కడ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. జన్మభూమిలోని లక్షలాది మందికి తోవ చూపుతుంటారు. అనూహ్యంగా ప్రపంచమంతటా విస్తరించిన కరోనా వైరస్‌ ఇలాంటి లక్షలాది మంది ఆశలపై నీళ్లు గుమ్మరిస్తోంది. ప్రస్తుతం ఆయా దేశాల్లో తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో పలువురు ‘ఈనాడు’తో ఫోన్‌లో పంచుకున్నారు. ఇవీ వివరాలు...


తాత్కాలిక ఉద్యోగాల తొలగింపు

కెనడాలో ఇంటర్న్‌షిప్‌లు, వైద్య కళాశాల ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు(ఎంక్యాట్‌) వాయిదా పడ్డాయి. చాలామంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయినవారికి నెలకు 2వేల డాలర్లను, పిల్లలున్న వారికి నెలకు 200 డాలర్లను ప్రభుత్వం అందిస్తోంది. ఓక్విల్లెలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న హనుమంతరావు మాట్లాడుతూ... ‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. భారతీయులు వినియోగించే కొన్ని సరకుల కొరత నెలకొంద’న్నారు. వెస్టర్న్‌ అంటారియో వర్సిటీ విద్యార్థిని ప్రజ్ఞ మాట్లాడుతూ... ‘విద్యార్థులు ఎక్కువగా చేసే తాత్కాలిక ఉద్యోగాలు పోయాయి. దీంతో విశ్వవిద్యాలయాల రుసుంల చెల్లింపు భారంగా మారుతోంద’ని వాపోయారు.


అమెరికా: ఆందోళనలో తెలుగువారు

అమెరికాలో ఉంటూ పన్ను చెల్లించే ప్రతి ఒక్కరి ఖాతాలో ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల 1,200 డాలర్లు జమ చేసింది. విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటూ... అధికారికంగా ఉద్యోగం చేసే వారి(పే రోల్‌లో పేరున్న) ఖాతాల్లోనూ నగదు వేశారు. భార్య, భర్త ఉద్యోగాలు చేసే వారితోపాటు పన్ను చెల్లింపు స్థాయికి అనుగుణంగా పిల్లల పేర్లతోనూ 500 డాలర్ల చొప్పున అందించారని ఓ పరిశ్రమలో పనిచేసే సిద్దూ వివరించారు. అయితే... దీర్ఘకాలంలో ఉద్యోగాలు పోతాయని, ఈ ప్రభావం తెలుగువారిపైనా ఉంటుందని రామ్‌చౌదరి వివరించారు. కొవిడ్‌ తర్వాత ఉద్యోగాలకు భారీ పోటీ నెలకొంటుందని అట్లాంటాలోని చింత హితేష్‌రెడ్డి వివరించారు. పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని తానా కార్యదర్శి రవి పొట్లూరి చెప్పారు. ‘అమెరికాలో వైరస్‌ ప్రభావం అమెరికన్ల తర్వాత స్పానిష్‌ జాతీయులపై ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి భారతీయ అమెరికన్లలో బాధితులు తక్కువే ఉన్నారు. న్యూజెర్సీ, హ్యూస్టన్‌, వర్జీనియాలో 13 మంది తెలుగు వారికి పాజిటివ్‌ రాగా, కాలిఫోర్నియాలో ఇద్దరు మృతి చెందార’ని తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన వివరించారు.


ఇంకొన్నాళ్లకు పస్తులు తప్పవేమో!
-లక్ష్మీ, ఐటీ ఉద్యోగిని, టెక్సాస్‌

తెలుగు వారు ఉపయోగించే ముడి ఆహార పదార్థాలకు డిమాండు భారీగా పెరగడంతో భారతీయ నిత్యావసరాల దుకాణాల నుంచి హోమ్‌ డెలివరీలు ఆపేశారు. బియ్యం, పప్పు, పాలు, బ్రెడ్‌ అందుబాటులో లేవు.  నా స్నేహితురాలు ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆమె దగ్గరున్న మందులు వాడినా నయం కాలేదు. ఏదేమైనా ఇల్లు కదలనంటోంది.


పౌరసత్వం ఉన్న వారికే సాయం
-అఖిల్‌ మద్దినేని, జార్జియా స్టేట్‌ వర్సిటీ

మాలాంటి వారి ఉపాధిని దెబ్బతీసింది. తాత్కాలిక ఉద్యోగాలు పోయాయి. చదువు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు దొరకడంలేదు. వర్సిటీలు తరగతులను ఆన్‌లైన్‌ చేశాయి. గ్రంథాలయం, క్యాంపస్‌, రవాణా లాంటి రుసుములను తగ్గించాయి. మరికొన్ని వర్సిటీలు సెమిస్టర్‌ రుసుముల్లో 40-60% తగ్గించాయి. అద్దెలు, ఇతరాలు భారంగా మారుతున్నాయి.


అద్దె చెల్లిస్తేనే నీళ్లు

కువైట్‌లోని కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 80 వేల మంది వరకు ఉన్నారు. ఇక్కడ ఒక్కో ఫ్ల్లాటులో 15-20 మంది వరకు నివసిస్తారు. వ్యక్తిగతదూరం పాటించేందుకు నలుగురికి మించి ఉండకూడదని ఆదేశాలొచ్చాయి. పైగా చేతిలో డబ్బులు లేవు. అద్దె కట్టకపోవడంతో యజమానులు విద్యుత్తు, నీళ్లు ఆపేస్తున్నారు. మరోవైపు అక్రమంగా నివసిస్తున్న వారికి క్షమాభిక్ష ప్రకటించి, ఈనెల 16-20 వరకు భారత్‌కు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. టికెట్ల ఖర్చులనూ భరిస్తామంది. విమాన సర్వీసులపై భారత్‌ నుంచి స్పష్టత లేకపోవడంతో ఆందోళనగా ఉంది.

- ముత్యాల వినయ్‌కుమార్‌(తెలంగాణ జాగృతి కువైట్‌ అధ్యక్షుడు), వెంకట్‌(లైఫ్‌ అగైన్‌ సంస్థ అధ్యక్షుడు), బాలిరెడ్డి(ఏపీఎన్‌ఆర్‌టీ సమన్వయకర్త), ఇలియాజ్‌(డైరెక్టర్‌)


నిర్మాణ రంగానికి మినహాయింపు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని దుబాయి, షార్జాల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువ. ఏప్రిల్‌ 5 నుంచి లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఉల్లంఘిస్తే రూ.25 వేలు జరిమానా విధిస్తున్నారు. అత్యవసరమైతే యాప్‌ ద్వారా అనుమతి తీసుకుని బయటికి వెళ్లొచ్చు. చిరుద్యోగులు, కార్మికులు సంకటంలో పడ్డారు. దుబాయి నుంచి ముక్కు తులసీకుమార్‌ మాట్లాడుతూ... లాక్‌డౌన్‌ నుంచి నిర్మాణరంగానికి మినహాయింపు ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌ రుసుం తగ్గించారు. వీసాల గడువును ఎలాంటి ఫీజు లేకుండా ఏడాది చివరివరకు పొడిగించారు. కంపెనీ వీసాలపై వచ్చిన ఉద్యోగులు ఉపాధి కోల్పోతే మరో కంపెనీకి మారే అవకాశమిచ్చార’ని వివరించారు


బయటికెళ్తే అరెస్టు

దక్షిణాఫ్రికాలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ విధించారు. జొహెన్నస్‌బర్గ్‌లో 4-5 వేల మంది తెలుగువారు ఉంటారు. నేను ఇంటి నుంచే పనిచేస్తున్నా. అనుమతి లేకుండా బయటకి వెళ్లినందుకు నాకు తెలిసిన 40 మందిని అరెస్టు చేశారు. ముడి ఆహార పదార్థాలన్నీ దొరుకుతున్నాయి. స్థానిక పౌరులకు ప్రభుత్వం రేషన్‌, ఆర్థిక సాయం చేస్తోంది. ఎన్నారైలకు ఏమీ ఇవ్వట్లేదు. శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు దొరకట్లేదు.

-సుధీర్‌రెడ్డి, ఐటీ ఉద్యోగి, జొహెన్నస్‌బర్గ్‌


కఠిన ఆంక్షలు

కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కేక్‌లోని వివిధ వైద్య కళాశాలల్లో ఏపీ, తెలంగాణల విద్యార్థులు చదువుకుంటున్నారు. మార్చి 26 నుంచి లాక్‌డౌన్‌ ఉంది. వసతి గృహాల్లోనే ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్నాం. గదులకే భోజనాలు పంపిస్తున్నారు. బిష్కేక్‌లో కఠిన ఆంక్షలు ఉన్నాయి. పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. విదేశీయులైతే పాస్‌పోర్టులు లాక్కుంటున్నారు. బయట గదులు అద్దెకు తీసుకొని ఉంటున్నవారు అవస్థలు పడుతున్నారు.

-బిష్కేక్‌ నుంచి వైద్య విద్యార్థులు


ఉద్యోగులపై తీవ్ర ప్రభావం

జర్మనీలో ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం ఎక్కువగా పడింది. కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తుండగా.. విద్యార్థుల తాత్కాలిక ఉద్యోగాలు పోయాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వారానికో రోజు జీతంలేని సెలవులు ఇస్తున్నాయి. మరికొన్ని 60% జీతాలను చెల్లిస్తున్నాయి. విద్యార్థుల వీసాలను జూన్‌ వరకు పొడిగించారు. వారికి నెలకు 300-400 యూరోలు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. నార్త్‌రైన్‌-వెస్ట్‌పాలియాలో ఉంటున్న వంశీధర్‌ గన్నవరపు మాట్లాడుతూ.... ‘ఉద్యోగుల వేతనాలను తగ్గించారు. సాధారణ పరిస్థితుల్లో నెలకు సగటున 2,400 యూరోలు సంపాదించేవారికి ఇప్పుడు 2000-2,200 యూరోలు దక్కుతున్నాయ’ని తెలిపారు.

Tags :

మరిన్ని