అగ్రరాజ్యానికి కాసింత ఊరట
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అగ్రరాజ్యానికి కాసింత ఊరట

న్యూయార్క్‌లో తగ్గిన కరోనా మరణాలు
ఈ రెండువారాల్లో ఇదే తొలిసారి
జపాన్‌, స్పెయిన్‌లలోనూ తగ్గిన కరోనా వైరస్‌ ఉద్ధృతి
రోజువారీ విధులకు హాజరవుతున్న బ్రిటన్‌ ప్రధాని

న్యూయార్క్‌: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచ దేశాలకు ఆదివారం కొంతలో కొంత ఉపశమనం లభించింది. మునుపటి రోజులతో పోలిస్తే పరిస్థితి కాస్త తెరిపిన పడింది. ప్రాణనష్టం కాస్త తగ్గుముఖం పట్టింది. న్యూయార్క్‌లో మృతుల సంఖ్య ఆదివారం 550 కంటే తక్కువ నమోదయింది. ఈ స్థాయికి ప్రాణనష్టం తగ్గడం గత రెండువారాల్లో ఇదే తొలిసారి. కొత్తగా ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ఐసీయూలలో చేరే రోగుల సంఖ్య తగ్గింది. ఆ నగరంలో కరోనా పాజిటివ్‌గా తేలిన పోలీసు అధికారులు కోలుకుని తిరిగి విధులకు హాజరవుతున్నారు. టెక్సాస్‌లో దుకాణాలు త్వరలో తెరచుకోనున్నాయి. ఫ్లోరిడాలో మరికొన్ని బీచ్‌లు, పార్కులలో పరిమితంగానైనా సందర్శకుల తాకిడి మొదలయింది.   కరోనా వ్యాప్తి చెందకుండా విధించిన ఆంక్షల్ని సడలించి, తమతమ ఆర్థిక రంగాలను తిరిగి గాడిన పెట్టాలని అమెరికాలో గవర్నర్లు వేగిరపడుతున్నా, మరీ వేగంగా ముందుకు వెళితే ఇబ్బందులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ని వ్యతిరేకిస్తూ అనేక బృందాలు నిరసనలను తీవ్రతరం చేస్తున్నాయి. పనిచేసుకునే అవకాశం ఇవ్వండంటూ టెక్సాస్‌లో వందల మంది ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది తమకు పని లభించడం లేదని చెప్పిన రాష్ట్రాల్లో ఆంక్షల్ని తక్షణం ఎత్తివేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆహార పొట్లాలకు ఎదురుచూపులు
ఆకలి, నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లు మాత్రం ఆహార పొట్లాల కోసం, విరాళాలిచ్చేవారి కోసం గంటలతరబడి ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల దాదాపు 2.20 కోట్ల మందికి పనిలేకుండా పోయింది. ఇలాంటివారంతా వెల్లువెత్తుతుండడంతో ఆహార పొట్లాలకు గిరాకీ అమాంతం పెరిగిపోతోంది. పరిస్థితిని చూసి అనేక సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా అవసరాలు తీరడం లేదు. అటు బ్రెజిల్‌లోనూ లాక్‌డౌన్‌కి వ్యతిరేకంగా ప్రధాన నగరాల్లో అనేకమంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఐసీయూలో ఉంచాల్సిన రోగుల సంఖ్య తగ్గిందని ఫ్రాన్స్‌ తెలిపింది. దక్షిణ కొరియాలో 20 రోజుల క్రితం ఒక్కరోజులోనే దాదాపు 900 కేసులు వస్తే ఇప్పుడు అది ఎనిమిదికి తగ్గింది.

పొడిగింపులు... సడలింపులు...
జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఫలితాలు వస్తున్న దృష్ట్యా మే 11 వరకు అలాగే ఉండాలని ఫ్రాన్స్‌ తమ ప్రజలను కోరింది. అత్యవసర పరిస్థితిని మే 9 వరకు పొడిగించి, పిల్లలకు మాత్రం ఈ నెల 27 నుంచి కొంత సడలింపు ఇస్తామని స్పెయిన్‌ ప్రకటించింది. ఆదివారం 410 మంది చనిపోయారనీ, గత నెలరోజుల్లో ప్రాణనష్టం పరంగా ఇదే తక్కువ అని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
* ప్రపంచం మొత్తం మీద కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1.64 లక్షలు దాటింది. 193 దేశాల్లో 23.87 లక్షల మంది దీని బారిన పడ్డారు. దాదాపు 6.13 లక్షల మంది కోలుకున్నారు.
* జపాన్‌లో కొత్తగా 568 మందిలో కరోనా బయటపడడంతో మొత్తం కేసుల సంఖ్య 10,361కి చేరింది.
* యూకేలోని వృద్ధుల సంరక్షణాలయాల్లో మాత్రం కరోనా మృతుల సంఖ్య వారం వ్యవధిలోనే రెట్టింపై, 2500కి చేరింది.
* కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ క్రమేపీ అధికార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు ఇస్తున్నారు. త్వరలోనే ఆయన పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహించగలరని అధికార వర్గాలు తెలిపాయి.
* ఉక్కిరిబిక్కిరి అయిన ఇటలీ ఇప్పుడు లాక్‌డౌన్‌ ముగింపు దిశగా అడుగులు వేస్తోంది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా జరిమానాలు విధిస్తున్నా వారు వినడం లేదు.
* సింగపూర్‌లో 596 మందికి కొత్తగా కరోనా సోకింది. వీరిలో 571 మంది విదేశీయులే. భారత్‌ సహా వివిధ దేశాల నుంచి వచ్చి, కిక్కిరిసిన డార్మిటరీల్లో నివాసం ఉండేవారు వైరస్‌ బారిన పడుతున్నట్లు తేలింది.


వుహాన్‌లో ముప్పు తగ్గింది: చైనా

కరోనాకు కేంద్ర బిందువుగా నిలిచిన వుహాన్‌ నగరంలో ఇప్పుడు ముప్పు తగ్గిందని చైనా ప్రకటించింది. అయితే వుహాన్‌ నుంచి బయటకు వెళ్లేవారికి మాత్రం న్యూక్లియిక్‌ ఆమ్ల పరీక్షలను తప్పనిసరి చేసింది. చైనాలో గత 24 గంటల్లో 16 కొత్త కేసులే వచ్చాయి. ప్రాణనష్టమేమీ సంభవించలేదు.

ఇవీ చదవండి..

కరోనా పుట్టుకపై ఎన్నెన్నో ఊహన్‌లు

కృత్రిమ యాంటీబాడీలతో కరోనా కట్టడి!

Tags :

మరిన్ని