మనవాళ్లకు మేమున్నాం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మనవాళ్లకు మేమున్నాం

అమెరికాలో భారత రాయబారి తరన్‌జీత్‌ సింగ్‌ సంధు భరోసా
‘ఈటీవీ భారత్‌’తో ప్రత్యేక ముఖాముఖి

దిల్లీ: కరోనా మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా సతమతమవుతోంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భారతీయులు.. ముఖ్యంగా విద్యార్థులను ఆదుకోవడానికి పలు భారతీయ-అమెరికన్‌ సంఘాలు, భారత రాయబార కార్యాలయం విశేషంగా కృషి చేస్తున్నాయి. వసతి, వైద్యం, ఆహారం పంపిణీ వంటి సౌకర్యాల్ని కల్పిస్తున్నాయి. అక్కడి తాజా పరిస్థితి, భారతీయులకు అందుతున్న సాయంపై అమెరికాలో భారత రాయబారి తరన్‌జీత్‌ సింగ్‌ సంధు.. ‘ఈటీవీ భారత్‌’ ప్రతినిధి స్మితశర్మకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు...

అమెరికాలో క్షేత్రస్థాయి పరిస్థితి ఎలా ఉంది? లాక్‌డౌన్‌లో భారతీయులకు మీ సేవలు?
దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ 7.50 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు 33 శాతం కేసులు ఒక్క న్యూయార్క్‌లోనే ఉన్నాయి. 90 శాతం మంది ప్రజలకు లాక్‌డౌన్‌ వర్తిస్తోంది. వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. భారతీయుల విషయానికి వస్తే 2 లక్షల మంది విద్యార్థులు, హెచ్‌1బీ వీసాపై పనిచేస్తున్నవారు 1.25 లక్షల మంది, గ్రీన్‌కార్డు కలిగిన వారు మరో ఆరు లక్షల మంది ఉన్నారు. వీరికి తోడు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పర్యటనలకు వచ్చిన వారు ఉండనే ఉంటారు. వీరికి రాయబార, కాన్సులేట్‌ కార్యాలయాల సిబ్బంది సేవలు అందిస్తున్నారు.

అమెరికాలో చిక్కుకున్నవారికి, ముఖ్యంగా విద్యార్థులకు ఎలా అందుబాటులో ఉంటున్నారు?
అవసరార్థులకు తక్షణ సాయం అందిస్తున్నాం. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, మా సొంత వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులో ఉంటున్నాం. కరోనా ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ప్రకటించిన మార్చి 11నే వాషింగ్టన్‌ డీసీలోని రాయబార కార్యాలయంతో పాటు, అమెరికాలోని అయిదు చోట్ల 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు తగిన సూచనలు ఇవ్వడానికి  ‘పీర్‌ సపోర్ట్‌ లైన్‌’ నెలకొల్పాం. దాదాపు 50 వేల మంది విద్యార్థులకు సమాచారం అందించాం. ఈ నెల 11న ఇన్‌స్టాగ్రాంలో ప్రత్యక్ష సంభాషణ ద్వారా దాదాపు 25 వేల మంది విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాం. పూర్తి వివరాలతో 20 దాకా సలహా పత్రాలు విడుదల చేశాం. వీటిలో విద్యార్థులకు అవసరమైన సూచనలన్నీ అందించాం.

వైద్యం, వసతి సౌకర్యాల కల్పన ఎలా?
వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే భారత సంతతి వైద్యులతో మాట్లాడి సహాయం అందేలా చూస్తున్నాం. చాలా విశ్వవిద్యాలయాలను సంప్రదించి భారతీయ విద్యార్థులు వసతి గృహాల్లోనే కొనసాగేలా చూశాం. ఇండియన్‌-అమెరికన్‌ హోటళ్ల యజమానులు కొందరు సహృదయంతో భారతీయ విద్యార్థులకు వసతి కల్పించారు. కొందరికి భారతీయ సంఘాలు ఆహారం అందిస్తున్నాయి.

వీసాలు ముఖ్యంగా హెచ్‌1బీ వీసాదార్ల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది?
వీసా సమస్యలపై చాలా వినతులు వస్తున్నాయి. హెచ్‌1బీ, జే1, ఎఫ్‌1 వీసాలపై ఆందోళన నెలకొంది. అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఈ అంశంపై దృష్టి పెడతారు. వీసాల విషయమై మేం విడుదల చేసిన సలహా పత్రాన్ని చూడాలని కోరుతున్నా. కరోనాపై పోరులో భారత్‌, అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగటం సంతోషదాయకం.

Tags :

మరిన్ని