వలసలపై నిషేధం 60 రోజులే: ట్రంప్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వలసలపై నిషేధం 60 రోజులే: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకు వలసల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దాన్ని ఎంత కాలం వరకు అమలు చేయనున్నారో కూడా స్పష్టతనిచ్చారు. 60 రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఇది ముఖ్యంగా శాశ్వత నివాస హోదా(గ్రీన్‌ కార్డు) కోసం వచ్చేవారిని లక్ష్యంగా చేసుకునే అమల్లోకి తెస్తున్నట్లు అర్థమవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత స్థానిక పౌరులకే ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఉండాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ‘‘ అమెరికాలోని నిరుద్యోగ పౌరులకు ప్రయోజనం ఉండాలనే ఉద్దేశంతోనే వలసల్ని నిలిపివేయాలని నిర్ణయించాం. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇక్కడి వారికి ఉండాలన్నది మా లక్ష్యం. వైరస్‌ విజృంభణ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి స్థానంలో వలస వచ్చిన వారిని చేర్చుకోవడం వల్ల ఇక్కడి వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అమెరికా పౌరుల సంక్షేమమే మా తొలి ప్రాధాన్యం. ఈ నిషేధం 60 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం’’ అని ట్రంప్‌ వివరించారు. 

ఈ నిషేధం నుంచి ట్రంప్‌ కొందరికి మినహాయింపునిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైరస్‌పై పోరులో ముందున్న వైద్య సిబ్బంది, ఆహార సరఫరా విభాగంలో పనిచేస్తున్న విదేశీయులను నిషేధం నుంచి తొలగించొచ్చని ఆయన పాలకవర్గంలోని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే వలసేతర వీసా అయిన హెచ్‌-1బీ పైనా స్పష్టతనిస్తూ మరో ఉత్తర్వు జారీ చేయొచ్చని తెలిపారు. 

ట్రంప్‌ ప్రకటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వలస విధానాలను కఠినతరం చేయాలని ఆయన చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్‌ విజృంభణతో తలెత్తిన పరిస్థితులను ట్రంప్‌ తన సొంత ఎజెండా అమలుకు అనుకూలంగా మల్చుకోవాలనుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కరోనాను నియంత్రించడంలో ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారని..ఆ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రకటన చేశారని అక్కడి వారు విమర్శిస్తున్నారు.

ఇవీ చదవండి..

మా దేశానికి రావద్దు

మనోళ్లకు ఇబ్బందికరమే

Tags :

మరిన్ని