ఫెడరల్‌ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఫెడరల్‌ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి

నామినేట్‌ చేసిన ట్రంప్‌
మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకూ కీలక పదవులు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు నామినేట్‌ చేశారు. అందులో న్యూయార్క్‌లోని ఓ ఫెడరల్‌ కోర్టు జడ్జి పదవి కూడా ఉంది. ‘అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ది ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌’కు ప్రముఖ మహిళా న్యాయవాది సరిత కోమటిరెడ్డిని ట్రంప్‌ ప్రతిపాదించారు. ఆమె నామినేషన్‌ను సెనేట్‌కు సోమవారం పంపించారు. సరిత ప్రస్తుతం న్యూయార్క్‌ ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో జనరల్‌ క్రైమ్స్‌ విభాగం డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. ప్రతిష్ఠాత్మక కొలంబియా లా స్కూల్‌లో న్యాయశాస్త్ర పాఠాలను కూడా బోధిస్తుంటారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, నగదు అక్రమ చలామణీ నిరోధక సంస్థకు తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌గా సరిత 2018 జూన్‌ నుంచి గత ఏడాది జనవరి వరకు ఉన్నారు. హార్వర్డ్‌ లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు.
* ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభాగమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధిగా భారతీయ అమెరికన్‌ న్యాయవాది అశోక్‌ మైఖేల్‌ పింటోను ట్రంప్‌ నామినేట్‌ చేశారు.
* పారిస్‌ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)కు తన రాయబారిగా భారతీయ అమెరికన్‌ సీనియర్‌ దౌత్యవేత్త మనీషాసింగ్‌ను ట్రంప్‌ నామినేట్‌ చేశారు.


Tags :

మరిన్ని