నా భార్యాబిడ్డలను తీసుకొస్తే రూ.10లక్షలు ఇస్తా!
నా భార్యాబిడ్డలను తీసుకొస్తే రూ.10లక్షలు ఇస్తా!

తిరువనంతపురం: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తన భార్యాబిడ్డలను సొంత రాష్ట్రం కేరళకు సురక్షితంగా చేర్చిన వారికి రూ.10లక్షల నజరానా ఇస్తానని అంటున్నాడు ఓ ఎన్‌ఆర్‌ఐ. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రజా రవాణాకు ఇంకా అనుమతులు ఇవ్వలేదు. లాక్‌డౌన్‌కు ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. అలా దుబాయ్‌కు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం కూడా వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయింది. దీంతో తన భార్యాబిడ్డలను సొంత రాష్ట్రానికి తీసుకొస్తే రూ.10లక్షలు ఇవ్వనున్నట్లు కెఆర్‌ శ్రీకుమార్‌ అనే ఎన్‌ఆర్‌ఐ ఫేస్‌బుక్‌ వేదికగా తెలిపాడు.

కేరళకు చెందిన శ్రీకుమార్‌ యునటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో కెమికల్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. తన భార్యాబిడ్డలను సొంత రాష్ట్రం తరలించేందుకు ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నాడు. అయితే, ఏవియేషన్‌ అధికారుల నుంచి అనుమతులు నిరాకరించడంతో తాజాగా ఫేస్‌బుక్‌ వేదికగా తన ఆఫర్‌ను ప్రకటించాడు.

‘‘నా కుటుంబం కేరళ చేరేందుకు ఎవరైనా సాయం చేస్తే, వారికి రూ.10లక్షల నజరానా ఇస్తా. ఈ ఆఫర్‌ కేవలం మే 12 అర్ధరాత్రి వరకే’’ అని తెలిపాడు. అయితే, ఈ ప్రక్రియ అంతా చట్టబద్ధంగా జరగాలని కండీషన్‌ పెట్టాడు. ‘నా పెద్ద కుమారుడు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో సీఏ చదువుతున్నాడు. నా భార్య, చిన్న కుమారుడు మంగళూరులో చిక్కుకుపోయారు. వాళ్లని క్షేమంగా కేరళలోని అలప్పుజాలోని మా ఇంటికి తరలించాలని అనుకుంటున్నా. నేను అన్ని రకాలుగా ప్రయత్నించా. కానీ, తప్పుడు మార్గాల ద్వారా వాళ్లను తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. ఎవరైనా వారిని క్షేమంగా మా ఇంటికి తరలిస్తే కచ్చితంగా రూ.10లక్షలు ఇస్తా’’ అని శ్రీకుమార్‌ తెలిపాడు. తన పెద్ద కుమారుడు రూ.15వేలకు ఒక క్యాబ్‌ బుక్‌ చేసుకోగా, డ్రైవర్‌ రాకపోగా డబ్బులు పోయాయని పేర్కొన్నాడు.

‘కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలువురు అధికారులు, రాజకీయ నాయకులతో నేను మాట్లాడా. అందరూ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఎవరూ చేయలేదు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ఈ ఆఫర్‌ ఇవ్వక తప్పడం లేదు. ఇదేదో పబ్లిసిటీ స్టంట్‌ కోసం నేను చేయడం లేదు. నా ఫ్యామిలీని ఒక చోటకు చేర్చడమే దీని వెనుక ఉద్దేశం’’ అని శ్రీకుమార్‌ చెప్పుకొచ్చాడు.


మరిన్ని