హెచ్‌-1బీ వీసాలపై తాత్కాలిక నిషేధం!
హెచ్‌-1బీ వీసాలపై తాత్కాలిక నిషేధం!

ట్రంప్‌ యంత్రాంగం యోచిస్తున్నట్లు మీడియా కథనం

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ, విద్యార్థి వీసాలు, వారికిచ్చే పని అనుమతులు వంటి పని ఆధారిత వీసాలపై తాత్కాలిక నిషేధం విధించాలని అగ్రరాజ్యం అమెరికా యోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. వలసేతర వీసా అయిన హెచ్‌-1బీ కింద అమెరికా కంపెనీలు భారత్‌, చైనా వంటి దేశాల నుంచి అత్యంత నైపుణ్యం ఉన్న ఉద్యోగులను (ఐటీ నిపుణులను) నియమించుకోవచ్చు. సుమారు 5లక్షల మంది హెచ్‌-1బీ హోదా కింద అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ‘‘కొన్ని రకాల తాత్కాలిక, పని ఆధారిత ఉద్యోగాలపై నిషేధం విధించేందుకు ఉద్దేశించిన కార్యనిర్వాహక ఆదేశం(ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌)పై  ప్రస్తుతం అధ్యక్షుడి వలస విభాగపు సలహాదారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఆదేశాలు నెలాఖరులోగా రావొచ్చు’’ అని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. హెచ్‌-1బీ, హెచ్‌-2బీ, విద్యార్థి వీసాలు వాటితోపాటు పనిచేసే అనుమతులపై ఈ ఆదేశం దృష్టిపెట్టే అవకాశముందని వివరించింది. కరోనా వైరస్‌ కారణంగా గత రెండు నెలల్లో అమెరికాలో 3.3 కోట్ల మంది అమెరికా పౌరులు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. వృద్ధి రేటు రుణాత్మకానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకులు ఇప్పటికే అంచనావేశాయి. రెండో త్రైమాసికంలో అమెరికా వృద్ధి -15 నుంచి -20కి పడిపోవచ్చునని శ్వేతసౌధం అధికారులు ప్రకటించారు. మరోవైపు, దేశంలో నిరుద్యోగం ఏప్రిల్‌లో 14.7% మేర పెరిగింది. చరిత్రలోనే ఇది అత్యంత గరిష్ఠం.

Tags :

మరిన్ని