వీసా ఉన్నా రాలేని పరిస్థితి..!
వీసా ఉన్నా రాలేని పరిస్థితి..!

ప్రతిబంధకాలుగా మారిన కేంద్ర ప్రభుత్వ నిబంధనలు

వాషింగ్టన్‌: కరోనా కట్టడి ఆంక్షల నేపథ్యంలో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం విధించిన కొన్ని నిషేధాజ్ఞలే అడ్డంకిగా మారాయి. అనేక మంది భారత్‌కు వచ్చే అవకాశం, అనుమతి ఉన్నా రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో తమని స్వదేశానికి తీసుకెళ్లేందుకు ‘వందే భారత్‌’ అంటూ వస్తున్న విమానాల్ని చూసి వారి ముఖంలో వెల్లివిరిసిన సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వివరాల్లోకి వెళితే..

విదేశీయుల వీసాలతో పాటు వీసా అవసరం లేకుండా భారత్‌కు వచ్చే వెసులుబాటు ఉన్న ‘ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ)’ కార్డులపై కేంద్ర ప్రభుత్వం గత నెల నిషేధం విధించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు అక్కడ చిక్కుకున్న కొంతమందికి ఈ ఆంక్షలే అడ్డంకిగా మారాయి. పలువురు హెచ్‌-1బీ, గ్రీన్‌ కార్డుదారుల పిల్లలు అక్కడే పుట్టడంతో వారంతా ఓసీఐ పరిధిలోకి వస్తారు. తల్లిదండ్రులు ప్రయాణించేందుకు ఇక్కడి నిబంధనలు ఒప్పుకుంటున్నా.. ఓసీఐ పరిధిలోకి వచ్చే పిల్లల్ని మాత్రం అనుమతించే అవకాశం లేదు. దీంతో సిబ్బంది వారిని విమానంలోకి అనుమతించలేదు. గత్యంతరం లేక తల్లిదండ్రులు సైతం వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 

న్యూజెర్సీలో హెచ్‌-1బీ వీసాపై ఉంటున్న దంపతులు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయారు. నిబంధనల ప్రకారం వారు 60 రోజుల్లోగా అమెరికా విడిచి వెళ్లాలి. దీంతో చేసేదిలేక ఉన్న ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎయిర్‌పోర్టుకు వచ్చేశారు. ఆ పిల్లలిద్దరూ అక్కడే పుట్టడంతో వారు ఓసీఐ పరిధిలోకి వస్తారు. దీంతో సిబ్బంది వారిని అనుమతించలేదు. పిల్లల్ని విడిచి వారు మాత్రమే రాలేని పరిస్థితి. చివరకు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘న్యూయార్క్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయ సిబ్బంది, ఎయిరిండియా సిబ్బంది చాలా సహకరించారు. కానీ, ఇటీవలి భారత ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో వారంతా నిస్సహాయులుగా మారారు’’ అని పరిస్థితిని వివరించారు. ఇలా నిబంధనల్లోని సాంకేతిక సమస్య వల్ల అనేక మంది హెచ్‌-1బీ, గ్రీన్‌ కార్డుదారులు అక్కడే నిలిచిపోయారు.


మరిన్ని