విదేశీ విద్యపై కరోనా నీడలు!
విదేశీ విద్యపై కరోనా నీడలు!

అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లో అనుమానమే
ఈనాడు - హైదరాబాద్‌

విదేశీ విద్యపై నీలినీడలు అలముకున్నాయి. కరోనా కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ఆగస్టులో ప్రారంభమయ్యే విద్యాసంవత్సరం ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. విద్యాసంవత్సరాన్ని ప్రారంభించినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వెళ్లే అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. వివిధ దేశాల్లో ఆగస్టులో ప్రారంభమయ్యే విద్యాసంవత్సరానికి డిసెంబరు-జనవరి నుంచి విద్యార్థులకు ఐ-20 ధ్రువపత్రాలు (ప్రవేశానుమతి) రావడం మొదలవుతుంది. డిసెంబరులో మొదలైన కరోనా కలకలం అన్ని దేశాలకు విస్తరించింది. ఈ కారణంగా అన్ని దేశాలు తమ విద్యాసంస్థలను మూసివేశాయి. మనదేశం నుంచి 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ దేశాలకు వెళుతుంటారు. సుమారు 25 వేల మంది వరకు అమెరికా వైపు మొగ్గు చూపుతారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది విదేశీ విద్యనభ్యసించేందుకు వెళుతుంటారని అంచనా. ఈ దఫా ఆ పరిస్థితి కనిపించటం లేదు.

అయోమయంలో విశ్వవిద్యాలయాలు అమెరికా, యూకేలలో వైరస్‌ ఉద్ధృతి ఇంకా అదుపులోకి రాలేదు. ఆగస్టు నాటికి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నుంచి ప్రతి విద్యాసంవత్సరంలో అందే ఆర్థిక సహాయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ విద్యార్థుల నుంచి కూడా అధికాదాయం లభిస్తుంది. వర్శిటీల నిర్వహణలో ఈ రెండు అంశాలు కీలకమని నిపుణులు చెబుతున్నారు. విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక అప్పటి పరిస్థితులను అంచనా వేసి.. ఈ విద్యా సంవత్సరంలో కోర్సులను నిర్వహించగలమా? లేదా? నిర్ణయిస్తామని అమెరికాలో పలు విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ ప్రతినిధుల సమాచారంగా ఉంది.

ఆగస్టుకు సమయం సరిపోదు
ఆగస్టులో మొదలయ్యే విద్యాసంవత్సరానికి అంతర్జాతీయ విద్యార్థులు హాజరు కావడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశ్వవిద్యాలయాలు తెరుచుకోవాలి? విద్యార్థులకు ఐ-20లను జారీ చేయాలి. అమెరికాలో చదువుకునేందుకు కనీసం రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తాన్ని విద్యార్థులు సమకూర్చుకోవాలి. అధిక శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. లాక్‌డౌన్‌తో బ్యాంకులకు వెళ్లడం కష్టంగా ఉంది. రుణ ప్రక్రియ ముగిశాక.. వీసా అపాయింటుమెంట్‌ కోసం ప్రయత్నించాలి. రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు ఎప్పటికి తెరుచుకుంటాయన్నది అధికారులు చెప్పలేని పరిస్థితి. ఈ కారణాల దృష్ట్యా ఈ విద్యాసంవత్సరానికి గడువు సరిపోయే అవకాశాల్లేవని వరల్డ్‌వైడ్‌ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ సీఈవో ఉడుములు వెంకటేశ్వరరెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. పలు దేశాల వర్శిటీలతో తాము సంప్రదింపులు జరిపినప్పటికీ స్పష్టత రావడం లేదన్నారు. ఒక్క ఐర్లాండ్‌ మాత్రమే విద్యార్థులను చేర్చుకునేందుకు సుముఖంగా ఉందని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని