డబ్ల్యూహెచ్‌వోను బెదిరించిన చైనా!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
డబ్ల్యూహెచ్‌వోను బెదిరించిన చైనా!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విషయమై ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)ను నిలువరించేందుకు చైనా ప్రయత్నించినట్టు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) పేర్కొంది. ఈ వివరాలన్నింటిని సీఐఏ తన తాజా నివేదికలో పొందుపరిచినట్టు ‘న్యూస్‌వీక్‌’ ప్రత్యేక కథనంలో తెలిపింది. ‘‘వైరస్‌ విషయమై ప్రపంచ వ్యాప్త ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తే... మేము అందించే సహకారాన్ని నిలిపేస్తాం’’ అని డబ్ల్యూహెచ్‌వోను చైనా బెదిరించినట్టు వివరించింది. జనవరిలో వైరస్‌ కేసులు చైనాలో విపరీతంగా ప్రబలుతున్నప్పుడు ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు తెలిపింది. వైరస్‌ వ్యాప్తికి చైనాయే బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే డిమాండ్‌ చేస్తున్న క్రమంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, వైరస్‌ విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించామని డబ్ల్యూహెచ్‌వో వర్గాలు పేర్కొన్నట్టు న్యూస్‌వీక్‌ వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, తమ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధ్‌నామ్‌ల మధ్య గత జనవరిలో ఫోన్‌ సంభాషణ జరిగిందన్న వార్తలను కూడా డబ్ల్యూహెచ్‌వో ఖండించినట్టు పేర్కొంది.

Tags :

మరిన్ని